agriculture: ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసే రైతులకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు పెనుభారంగా మారుతున్నాయి. ఎకరం పంట పండించేందుకు గతంలో రూ.15 వేల ఖర్చు వస్తే ప్రస్తుతం రూ.25 వేలకు ఖర్చు అవుతోంది. దీంతో రైతుకు పెట్టుబడి భారంగా మారింది. దిగుబడితో పోలిస్తే జమ, ఖర్చులు పోను శేషం ‘సున్నా’ మిగులుతోంది. రెండు సంవత్సరాలతో పోలిస్తే ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్‌కు సంబంధిత కిరాయిలు అధికంగా పెరిగి పోయాయి. పోయిన వానకాలం సీజన్ లీటరు డీజిల్ ధర రూ.95-100 వరకు ఉండగా ప్రస్తుతం రూ.105 వరకు ఉంది. దీని ప్రభావంతో ట్రాక్టర్ యజమానులు కిరాయి పెంచారు. పొలం, తోటల్లో కల్టివేటర్, ప్లావ్, కేజ్‌వీల్స్, రొటవేటర్ తదితర పనులు చేయడానికి రేట్లు పెంచేశారు. గతేడాది ఎకరాకు15 వేలు ఖర్చు వస్తే ప్రస్తుతం రూ.25వేల వరకు ఖర్చు వస్తుంది. దీనికి తోడు మహిళలకు పొలం వేస్తే రోజుకు రూ.400 ఉండేది ప్రస్తుతం రూ.500-550 వరకు ఉంది. పురుషులు పొలంలో నారు గుంజి తదితర పనులు చేస్తే రూ.800 వరకు కూలీ ఉండగా ప్రస్తుతం రూ.1000 అయ్యింది. దీనికి తోడు పంట చేలలో మందుల పిచికారీకి సైతం పంపులకు పెట్రోల్ అవసరం ఉంటున్నందున మందుకు మించి ఇంధనానికి ఖర్చు అధికంగా అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కూలీలకు డిమాండ్
వ్యవసాయం అంటే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది. ఒక్క మహిళకు రోజుకు నాట్లు వేసేందుకు రూ.500 చెల్లిస్తున్నారు. ఉదయం 10 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు పని ముగిస్తారు. వారికి వాహనంలో పొలం వద్దకు తీసుకెళ్లి, పని ముగిసిన తర్వాత ఇంటికి చేర్చాలి. వేరే గ్రామానికి పనికి వెళ్తే రూ.600 తీసుకుంటారు. తోట పనికి వెళ్తే రోజుకు రూ.250 లేదా గంటకు రూ.60 ఇవ్వాలి. ఒక్కరు నారుమడిలో పంచితే రోజుకు రూ.1000 నుంచి రూ.1100 వరకు ఇవ్వాలి. ముందుగా చెబితే తప్ప కులీలు దోరికే పరిస్థితి లేదు.
ఇతరరాష్ట్రాల నుంచి కూలీలు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయంలో రైతులకు సహాయంగా బిహార్, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి జిల్లాలో పలు కేంద్రాల్లో ఉండి మండలాలకు చేరుకుని గ్రామాల్లో పొలం పనులు ఎకరానికి రూ.5500-6000 వరకు తీసుకొని పనులు చేస్తూ వ్యవసాయ పనులకు ఆసరాగా నిలుస్తున్నారు.
రైతు పెట్టుబడి పోను మిగిలేది తక్కువే
రైతులు వ్యవసాయంలో రోజు రోజు ఆధునిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్నారు. కానీ పెట్టుబడి పోను మిగిలేది తక్కువనేనని ఆవేదన చెందుతున్నారు. ఎకరం పొలం దుక్కి దున్ని, జిలుగు, కేజివిల్స్, పంట విత్తనాలు, మందులు, కులీలతో పంట వేయటం, మందులు స్ప్రే చేయడం, పండిన పంట చేతికి వచ్చే వరకు దాదాపు రూ.25 వేల నుంచి 28 వేలు ఖర్చులు వస్తున్నాయి. పంట పండితే దాదాపు రూ.50 వేల నుంచి 55వేల వరకు రాగా మిగిలేది తక్కువే. కానీ వ్యవసాయంలో ఉన్న తృప్తి వేరేనని ఆనందంతో చెబుతున్నారు.
ట్రాక్టర్ కిరాయిల్లో మార్పులు
కల్టివేటర్ (చిన్న నాగళ్లు) : రూ.1000-1200
ప్లావు (పెద్దనాగలి) : రూ.1500-1800
డొజర్( బ్లెడ్‌తో చదును) : 1200-1400
రోటవేటర్ : రూ.1200-1600
కేజ్‌విల్స్ : రూ.1400 – 1800
ధరల నియంత్రణ లేదు : గుమ్మల రమేశ్, రైతు వేములకుర్తి
పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దుక్కి దున్నేందుకు తదితర కూలీల ధరలు పెరిగాయి. దీంతో ట్రాక్టర్ కిరాయిలు పెంచారు. డీజిల్ ధర పెరిగిందని ట్రాక్టర్ యజమానులు అంటున్నారు. ప్రతి పనికి రేటు పెరిగింది. రైతులకు మిగిలేది తక్కువే.
ఖర్చులు బాగా పెరిగాయి : ఏనుగు మహేందర్, రైతు తిమ్మాపూర్
వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. కూలీలు దొరకడం లేదు. కూలీలు దొరికినా ధరలు పెంచి కూలీ ఇస్తున్నం. ఏమైనా వ్యవసాయం చేయాలంటే వ్యయం బాగానే అవుతోంది. రైతులకు అన్ని పోను మిగిలింది ఏమీ లేదు.