AISF: కరీంనగర్, మార్చి 12 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేశ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ ప్రాముఖ్యతను వివరించారు. సమాజం ముందుకు వెళ్లాలంటే విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ, విద్యారంగంలో చివరి స్థానంలో ఉందని తెలిపారు. ప్రజా పాలకులమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గత పాలకుల మాదిరిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు. ప్రభుత్వ పాఠశాలల నిలిపివేసి, మౌలిక సౌకర్యాలు పెంపొందించాలన్నారు. రానున్న బడ్జెట్‌లో విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీ అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారావు వెంకటేశ్, జిల్లా సహాయ కార్యదర్శి కేశ బోయిన రాము యాదవ్, జిల్లా నాయకులు సురేశ్, ప్రవీణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.