ABVP leaders arrested: గొల్లపల్లి, నవంబర్ 16 (మన బలగం): గొల్లపల్లి మండలం నుంచి బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేశ్ విద్యార్థి నాయకులను పోలీస్ స్టేషన్‌లో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఆత్మహత్య చేసుకున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేయించారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని, విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. విద్యార్థుల పక్షాన ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యకు కారణాలపై సమగ్ర విచారణ జరిపి, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలి. ఇంకా జాప్యం చేయకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మండల నాయకులు చేవులమద్ది కార్తీక్, నాయకులు అనిల్ రాజు హరీశ్, రాజేందర్, నవీన్, రఘుపతి, ఉదయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.