CPI dharna
CPI dharna

CPI dharna: కరీంనగర్-2 డిపోను జేబీఎం సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ ధర్నా

  • ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోం
  • ఆర్టీసీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
  • సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

CPI dharna: కరీంనగర్, జనవరి 25 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అలా చేస్తే సీపీఐ చూస్తూ ఊరుకోదని కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో కరీంనగర్-2 డిపోను జేబీఎం సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం డిపో ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లుగా ఉందని, డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటి నిర్వహణ బాధ్యతలను మెగా, జేబీఎం సంస్థలకు ఇప్పటికే అప్పచెప్పిందని తెలిపారు. వాటిని తక్షణమే వెనక్కి తీసుకొని ఆర్టీసీ సంస్థ పరిధిలోనే నిర్వహణ జరగాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం మెగాకు 500 బస్సులు, జేబీఎం సంస్థకు 500 బస్సులు తయారు చేసి ఇవ్వాలని ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు సంస్థల నుంచి కొన్ని రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 400 బస్సులను ఆర్టీసీ సంస్థకు అప్పగించిందని వెల్లడించారు. సంస్థ ఆ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా కొన్ని డిపోలకు కేటాయించిందన్నారు.

అందులో కరీంనగర్-2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు జరగగా డిపోలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఇతర డిపోలకు తరలించి అందులో ఉన్న ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేసారని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం డిపోను జేబీఎం అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని, ఆ నిర్ణయాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిచే రూట్‌లలో ఎలక్ట్రిక్ డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులను నడిపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేకుండా మహాలక్ష్మి పథకాన్ని నీరు గారిచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అన్నారు. గతంలో కరీంనగర్ నుంచి సిరిసిల్ల, కామారెడ్డి, గోదావరిఖని, లక్సెట్టిపేట్, మంచిర్యాల ప్రాంతాలకు అత్యధికంగా పల్లె వెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిచేవని తెలిపారు. ప్రస్తుతం వాటిని తగ్గించి ఆ రూట్లలో ప్రైవేట్ హైర్ బస్సులను, ఎలక్ట్రికల్ డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నారని చెప్పారు. వాటి మూలంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థకు 58 వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఉండేవారని, నేడది 42 వేలకు పడిపోయిందని, పదివేలకు పైగా బస్సులు ఉండేవని నేడవని, 9 వేలు కూడా లేకుండా పోయాయని తెలిపారు.

సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు తీవ్రమైన పని భారం పెరిగి అనారోగ్యాలకు గురవుతున్నారని, శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో కారుణ్య నియామకాలు తప్ప నూతన రిక్రూట్‌మెంట్ లేదన్నారు. ఆర్టీసీ డిపోల వద్ద గతంలో ఎగుమతి దిగుమతి కోసం కూలీ వారు పనిచేసేవారని, కార్గో సర్వీస్ వచ్చిన తర్వాత కూలీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు. కొంతమందిని మాత్రమే ఉపయోగించుకుంటున్నారని, ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని ఎగుమతి, దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్టీసీ సంస్థను కాపాడడంతోపాటు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన డిపోలను తిరిగి ఆర్టీసీ సంస్థ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించక తప్పదని వెంకటస్వామి హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, న్యాలపట్ల రాజు, పిట్టల సమ్మయ్య, భామండ్ల పెల్లి యుగేందర్, కంది రవీందర్ రెడ్డి, బోనగిరి మహేందర్, మచ్చ రమేశ్, నాయకులు చెంచల మురళి, ఓర్సు కొమురయ్య, సత్యనారాయణ, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, కాల్వ శ్రీనివాస్, హేమంత్ కుమార్, కేతవ్వ, శారద తదితరులు పాల్గొన్నారు.

CPI dharna
CPI dharna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *