Voter Awareness Rally: నిర్మల్, జనవరి 25 (మన బలగం): జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ధర్మసాగర్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిదని తెలిపారు. విద్యార్థులందరూ తమకు ఓటు హక్కు వయసు రాగానే పేర్లను నమోదు చేసుకొని తప్పకుండా ఓటు వేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం మరింత పెరగాలన్నారు. విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి వారందరూ ఓటు వేసేలా చూడాలన్నారు. అధికారులు ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి అన్ని ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై నినాదాలు చేస్తూ విద్యార్థుల ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో పి.రామారావు, తాహసిల్దార్లు రాజు, సంతోష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
