Ganesh Festival Peace Committee Meeting Nirmal: నిర్మల్, ఆగస్టు 20 (మన బలగం): నిర్మల్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గణేశ్ ఉత్సవాలపై పీస్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై హిందూ, ముస్లిం ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణేశ్ ఉత్సవాలు సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలవాలని, ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా జరుపుకోవాలని కోరారు. ప్రజల ఆచార సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉత్సవాలు జరగాలని సూచించారు. ప్రతిష్ఠాపనలు, నిమజ్జనం సహా అన్ని కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో ముగియాలని తెలిపారు. జిల్లా, డివిజన్ స్థాయిలో అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.
నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో రూట్‌ల వారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని, శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగాలని సూచించారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. నిమజ్జనం జరిగే రూట్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, రహదారులు సక్రమంగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల క్రేన్‌లను సిద్ధం చేయాలని సూచించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో నిమజ్జన ప్రాంతాలను అధికారులు ముందుగానే పరిశీలించాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ, వైద్య ఆరోగ్య, విద్యుత్ తదితర విభాగాలు పరస్పర సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, గణేశ్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల విషయంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడతారని తెలిపారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక బందోబస్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఉత్సవాలు మరింత సాఫీగా జరిగేలా ప్రజలందరూ పోలీసులకు సకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ అవినాష్ కుమార్, రాజేష్ మీనా, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ అనంతరావు పటేల్, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
