- శోభాయాత్రల మార్గాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
- 24 గంటల పికెటింగ్ బృందాలు
- వరదలో చిక్కుకున్న వారికి తక్షణ సహాయం
- లైఫ్ జాకెట్లు, బోట్లు సిద్ధంగా ఉంచాలి
- సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులను ఆదేశించిన నిర్మల్ ఎస్పీ
Ganesh immersion bandobast Nirmal SP Janaki Sharmila: నిర్మల్, ఆగస్టు 30 (మన బలగం): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు శాంతియుతంగా, సురక్షితంగా జరగాలని, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయం అయిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని స్థాయి పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలు జారీ చేశారు. శోభాయాత్రల మార్గాల్లో ముందుగానే తనిఖీలు చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఎస్పీ అధికారులకు ఆదేశించారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతిభద్రతల కోసం ప్రతి చోట పికెటింగ్, పెట్రోలింగ్ బృందాలు 24 గంటలు విధుల్లో ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలని, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక మార్గాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా వాహనాలు ఎక్కడికక్కడ ఇరుక్కుపోకుండా చూసుకోవాలి అని సూచించారు. గణేశ్ శోభాయాత్ర రూట్లలో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన శోభాయాత్రలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు, పట్టణాలు జలమయం అయి లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు నీటమునిగిపోగా, వాగులు–వంకలు పొంగిపొర్లి రహదారులు దెబ్బతిన్నాయి. ఇంకో రెండు రోజులు కూడా వర్షాల సూచనలు ఉన్న కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వరదలో చిక్కుకుపోయిన వారికి తక్షణ సహాయం అందించేందుకు, రెస్క్యూ బృందాలను, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను, లైవ్ జాకెట్లు, రబ్బరు బోట్లు, అందుబాటులో ఉంచి తక్షణ సహాయానికి సన్నద్ధం చేయాలన్నారు.
ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది 24 గంటలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదంలో పడకుండా వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, చెరువులు, వాగులు, రోడ్లు దెబ్బతిన్న చోట్ల “రెడ్ ఫ్లాగ్స్” ఏర్పాటు చేసి వాటిని స్పష్టంగా “డేంజర్ జోన్”గా ప్రజలకు తెలియ జేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సెట్ కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన, ఇన్‌స్పెక్టర్లు, ఆర్ఐలు, అన్ని స్టేషన్ల ఎస్.హెచ్.ఓలు పాల్గొన్నారు.
