- ఆచూకీ తెలియక ఆందోళన
- కొట్టుకుపోయిన కొన్ని పశువులు
- భారీ వర్షాలతో పలు గ్రామాలు జలదిగ్బంధం
- శాంతిస్తున్న గోదారమ్మ
- నీట మునిగిన వేలాది ఎకరాల పంటలు
- దెబ్బతిన్న ఇండ్లు, భారీగా ఆస్తి నష్టం
- మునిపెల్లి కుర్రులో చిక్కుకున్న 300 బర్రెలు
- ఆందోళనలో ఇరు గ్రామాల ప్రజలు
Godavari floods cattle missing Nirmal district: ఐదు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. గోదారి ఉగ్రరూపానికి భారీగా పంటలు, ఆస్తి, పశు, ప్రాణ నష్టం జరిగింది. అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. దారులు కొట్టుకపోయి కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యమే లేకుండా పోయింది. సకాలంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేయడంతో భారీగా ప్రాణనష్టం జరగకుండా నిరోధించగలిగారు. ఎప్పటికప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది.
నీట మునిగిన పంటలు
నిర్మల్ జిల్లాలో తక్కువ సమయంలో కురిసిన అధిక వర్షాపాతం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. ఏదో ఓ రకంగా రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. అతివృష్టి, లేదంటే అనావృష్టి కారణంగా రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. ఈ ఏడు సకాలంలో పంటలను వేసుకున్న రైతాంగం పంటలు సైతం ఆశాజనకంగా ఉండడం వల్ల ఆర్థిక కష్టాలను గట్టెక్కవచ్చు అనుకున్న అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. జిల్లా వ్యాప్తంగా పత్తి, పసుపు, సోయా, మక్కా, వరి, మిర్చి, కూరగాయల పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఏపుగా ఎదిగిన పంటలు కళ్లముందే నీట మునిగి నష్టపోవడాన్నీ రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు జిల్లా అధికారులను కోరుతున్నారు.
భారీగా ఆస్తి నష్టం
అకాల వర్షాలకు జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది. నిర్మల్, బాసర పట్టణాలతోపాటు వివిధ మండలాల్లో అనేక ఇళ్లలో వర్షం నీరు చేరింది. దీంతో నిత్యావసర సరుకులు, బట్టలు, ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా చెడిపోయాయి. కొన్నిచోట్ల ఇండ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు భారీగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
కుర్రోలో చిక్కుకున్న 300 బర్రెలు
ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి గోదావరి మధ్యలో ఇరు గ్రామాల బర్రెలు చిక్కుకున్నాయి. లక్ష్మణ్‌చాందా మండలం మునిపెల్లి, మాచాపూర్ గ్రామాలకు చెందిన బర్రెలు సమీపంలోని గోదావరి మధ్యలో గల కుర్రుకు మేతకు వెళ్లాయి. ఒకేసారి భారీ వర్షం కురియడంతో గోదావరి ఉప్పొంగింది. ఇరు గ్రామాలకు చెందిన పశువుల కాపరులు సైతం చిక్కుకుపోయారు. ఒకరు ఈత రావడంతో బయటకు రాగా మరో వ్యక్తి గోదావరిలోనే చిక్కుకుపోయాడు. ఆయనను పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ బృందాల సహాయంతో క్షేమంగా రక్షించారు. ఐదు రోజులు గడుస్తున్నా పశువుల ఆచూకీ లభించడం లేదు. మాచాపూర్ గ్రామానికి చెందిన 80 బర్రెలు మునిపల్లి గ్రామానికి చెందిన 220 బర్రెలు గోదావరిలోని కుర్రులో చిక్కుకున్నాయి. వాటిలో ఎన్ని బర్రెలు ఉన్నాయనేది తేలడం లేదు. ఇప్పుడిప్పుడే గోదావరి శాంతిస్తుండడంతో బర్రెలను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కుర్రులో చిక్కుకున్న బర్రెల కోసం ఇరు గ్రామాల ప్రజలు గోదావరి ఒడ్డున వేచిచూస్తున్నారు. కాగా కొన్ని బర్రెలు గోదారి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. వాటిలో ఎక్కువ శాతం పాలు ఇచ్చే బర్రెలు ఉండడం వల్ల ఇంటి వద్ద వాటి లేగల అరుపులు పశువుల యజమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. దీంతో ఇరు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
శాంతిస్తున్న గోదారమ్మ
ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగిన గోదారమ్మ ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. తక్కువ సమయంలో భారీ వర్షం కురియడంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ప్రాజెక్టులు నీటిని భారీ ఎత్తున వదిలిపెట్టడం వల్ల గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో గోదావరి పరివాహక గ్రామాలు, పంట పొలాలు జలమయమైపోయాయి. వర్షాలు తగ్గుముఖంపట్టడంతో ఇప్పుడిప్పుడే గోదారమ్మ శాంతిస్తోంది.