RTC Telangana: నిర్మల్, ఫిబ్రవరి 6 (మన బలగం): ఆర్టీసీ నిర్మల్ డిపో ఉద్యోగులు ఈ నెల 9వ తేదీ తర్వాత రాష్ట్ర జేఏసీ నాయకులు నిర్ణయించిన తేదీకి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని నిర్మల్ డిపో కార్మికుల ప్రకటించారు. గురువారం సాయంత్రం నిర్మల్ డిపో ఎదురుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఎన్నికల మేనిపెస్టోలో పెట్టి ఆర్టీసీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2017 పేస్కెలుకు సంబంధించిన ఏరియర్స్ చెల్లించాలి, ప్రభుత్వంలో విలీన ప్రక్రియ అమలుచేసి 2021, పేస్కెలు అమలు పరచాలి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పించాలి. యూనియన్‌లను పునరుద్ధరించాలి, రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఏ ఏరియర్స్ ఇవ్వాలి, పనిభారం తగ్గించాలి, ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. యాజమాన్యం వేధింపులు మానుకోవాలని అన్నారు. డిమాండ్‌లు నెరవేర్చని యెడల రాష్ట్ర జే.ఏ.సి. పిలుపు మేరకు మేము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని నిర్మల్ డిపో గేట్ ముందర ధర్నాకు దిగారు. కార్యక్రమంలో నిర్మల్ డిపో నాయకులు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.