- జిల్లాలో 4483 మంది రైతులకు రూ.22 కోట్లు రావాలి
- పంట పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న అన్నదాత
- ప్రభుత్వం తీరుపై రైతుల్లో అసంతృప్తి
Telangana farmers waiting for paddy bonus payments in Khanapur: రైతు ప్రభుత్వం పని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రైతులకు కష్టాలు తప్పటం లేదు. ఒక వైపు యూరియా బస్తా కోసం రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు బోనస్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడంలేదు. పంట పెట్టుబడికి డబ్బులు రైతున్న కన్నీరు మున్నీరవుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి సన్న రకాలకు బోనస్ ప్రకటించడంతో రైతులు గడిచిన రబీలో సన్న ధాన్యం పండించారు. పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మే నెలలో అమ్ముకున్నారు. ధాన్యం విక్రయించి నాలుగు నెలలు అవుతున్నా బోనస్ డబ్బులు రాకపోవడంతో సదరు రైతుల్లో ఆందోళన నెలకొంది. అసలు బోనస్ డబ్బులు వస్తాయా? రావా.? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాల్లో 4483 మంది రైతులకు రూ.22 కోట్ల 22 లక్షలు రావాలి. ఈ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సకాలంలో ఈ డబ్బులు వస్తే ప్రస్తుతం పంట పెట్టుబడికి ఎంతో ఉపయోగపడెదని రైతులు ఆవేదనతో పేర్కొన్నారు. ఒక్క ఖానాపూర్ మండలంలోనే ఖానాపూర్, తిమ్మాపూర్, దిలావర్ పూర్, గోడలపంపు, తర్లపాడ్ తదితర గ్రామాలకు చెందిన 172 మంది రైతులు, 5882 క్వింటాళ్ల సన్న ధాన్యం విక్రయించారు. సదరు ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ మొత్తం రూ.29 లక్షల 41 వేలు రావాల్సి ఉంది. దొడ్డు రకం కన్నా దిగుబడి తక్కువగా ఉంటుందని తెలిసి రైతులు బోనస్ వస్తుందన్న ఆశతో సన్నాలు పండించారు. ఖరీఫ్ వరినాట్లు పూర్తయినా యాసంగి ధాన్యం బోనస్ డబ్బులు రాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది.
కాలపరిమితి అంటూ లేదు
బోనస్ డబ్బులను ప్రభుత్వం ఎన్ని రోజులకు రైతుల ఖాతాల్లో జమ చేస్తుందో అధికారుల్లో స్పష్టత లేదు. ధాన్యం విక్రయించి నెలలు గడిచినా ప్రభుత్వం తీరు ఇలా ఉంటే రానున్న యాసంగిలో సన్న ధాన్యం సాగుకు రైతులు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు దృష్టి సారించి బోనస్ డబ్బులు వెంటనే వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
సన్న ధాన్యంపై ఆసక్తి తగ్గింది: తుదిగెని ప్రవీణ్, రైతు, శాంతీనగర్
సన్నధాన్యం పండిస్తే బోనస్ వస్తుందని గడిచిన యాసంగిలో 12 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేశాను. 380 క్వింటాళ్ల బోనస్ రూ.1లక్షా 90 రావాలి. ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారో అధికారులు చెప్పడం లేదు. పంట పెట్టుబడికి ఉపయోగ పడని డబ్బులు వచ్చినా. సంతృప్తి ఉండదు. రానున్న రబీలో సన్న ధాన్యం సాగుచేయడం ఇష్టం లేదు.
గ్రాంట్ రాలేదు: రాజేందర్, డీసీఎస్‌వో, నిర్మల్
బోనస్ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దు. ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.