- భారీ బహిరంగ సభ
- రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా: కోదండరాం
- పర్యావరణానికి ఫ్యాక్టరీతో హాని: పర్యావరణవేత్త బాబురావు
- పోరాటంలో చివరికి విజయం మనదే: పీవోడబ్ల్యూ సంధ్య
Prajagalam: నిర్మల్, అక్టోబర్ 18 (మన బలగం): నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ విజయవంతం అయింది. మండలానికి చెందిన వేల సంఖ్యలో రైతులు సభకు హాజరై మినీ మిలియన్ మార్చ్‌ను తలపించింది. ఫ్యాక్టరీ నిర్మాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ఎమ్మెల్సీ కోదండరాంతోపాటు పర్యావరణ శాస్త్రవేత్తలు, మానవ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు తదితరులు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో రక్షణ చర్యలు తీసుకున్నారు. అనంతరం సభకు వచ్చిన వక్తలు ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులకు సందేశాలను ఇచ్చారు.
రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాం : కోదండరాం
ప్రజాగళం బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం రైతులను ద్వేషించి మాట్లాడారు. రైతులు సంఘటితంగా పోరాటం చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మండలంలోని రైతులు, ప్రజలు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని, రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక్కడి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తామని, ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
పర్యావరణానికి ఫ్యాక్టరీతో హాని: పర్యావరణవేత్త బాబురావు
అనంతరం ప్రముఖ పర్యావరణ వేత్త బాబురావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని ఉదాహరణల ద్వారా రైతులకు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం తప్పుడు నివేదికలను సమర్పించి పర్యావరణ అనుమతులు పొందారని మండిపడ్డారు. కలెక్టర్ సమావేశంలో పర్యావరణ శాస్త్రవేత్తలు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన అనుమానాలను అడిగితే అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం ముఖం చాటేయడం అంటే రైతులకు మోసం చేసే పరిశ్రమను స్థాపిస్తునట్లే అని ఆరోపించారు. ఫ్యాక్టరీతో ఎటువంటి నష్టాలు జరగకపోతే తప్పుడు నివేదికలతో అనుమతి పత్రాలను ఎందుకు పొందటం అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
విజయం సాధించే వరకు వెనకడుగు వేయద్దు: పీవోడబ్ల్యూ సంధ్య
ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు సంఘటితంగా చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నామని పీవోడబ్ల్యూ సంధ్య అన్నారు. పచ్చని పంట పొలాల మధ్య ఫ్యాక్టరీని స్థాపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, భూములు అమ్ముకొని వలస వెల్లే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. మన భూములను మనం కాపాడుకోవడానికి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విజయం సాధించేవరకు వెనకడుగు వేయద్దని కోరారు. రైతులకు ఎల్లప్పుడూ తాము అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో టీపీజేఏసీ కన్వీనర్ రవి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య, టీపీజీఏసీ రాష్ట్ర నాయకులు కొండల్ రెడ్డి, టీపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు భుజంగరావు, న్యూ డెమోక్రటిక్ అధ్యక్షులు చలపతిరావు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.