Nirmal Municipality: వరుసగా మన బలగంలో ప్రచురితమైతున్న భూ ఆక్రమణ కథనాలపై విశేష స్పందన లభిస్తోంది. ఏ నోట విన్నా భూ ఆక్రమణల చర్చ సాగుతోంది. శనివారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన నిర్మల్ మున్సిపల్ పాలకవర్గ సమావేశంలోనూ హైడ్రా గురించి చర్చ కొనసాగింది. ఆక్రమణల్లో నిర్మల్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని పలువురు పాలకవర్గ సభ్యులు చర్చ లేవనెత్తారు. దీంతో భూ ఆక్రమణల వ్యవహారంపై వాడివేడిగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైడ్రా నిర్మల్‌కు రావాల్సిందేనని సభ్యులు సభలో లేవనెత్తారు. ఈ విషయంపై చర్చ జరిగిన అనంతరం హైడ్రా నిర్మల్‌కు రప్పించాలని సభ్యులు సభలో ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వానికి నివేదిక పంపాలని సభ్యులు సూచించారు.
మూడు సమస్యలకు శాశ్వత పరిష్కారం
నిర్మల్ మున్సిపాలిటీలో ప్రజలను నిత్యం వేధిస్తున్న మూడు సమస్యలైన విద్యుత్తు, తాగు నీరు, శానిటేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకొస్తామని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు సమావేశంలో చర్చించారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై సభ్యులు చర్చించారు. పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉండడం బాధాకరమని కౌన్సిల్ సభ్యులు అయ్యన్న గారి రాజేందర్ అన్నారు.
విధుల్లో చేరిన పారిశుధ్య కార్మికులు
నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు శనివారం నుంచి విధుల్లోకి చేరారు. వేతనాల బకాయిలు చెల్లించాలని ఐదు రోజులుగా విధులను బహిష్కరించిన కార్మికులకు ఒక నెల వేతనాన్ని చెల్లించడంతో విధుల్లో చేరారు. ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడంతో పట్టణంలో చెత్త ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ఐదు రోజుల తర్వాత విధుల్లో చేరిన కార్మికులు చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.