Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: మస్కా బన్.. ఛాయ్!

  • సాదాసీదాగా నీలోఫర్ కేఫ్‌కు కేంద్ర మంత్రి
  • అరగంటకుపైగా కేఫ్‌లో గడిపిన బండి సంజయ్

Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం అనుకోకుండా హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని నీలోఫర్ కేఫ్‌కు వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్‌లతో కలిసి నీలోఫర్ కేఫ్‌కు వచ్చారు. సాదాసీదాగా కేఫ్ లోకి వెళ్లి కూర్చుని ‘మస్కా బన్’ ఆరగించడంతోపాటు ఛాయ్ తాగారు. బండి సంజయ్ వచ్చారని తెలుసుకున్న నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు. నీలోఫర్ చాయ్, మస్కా బన్ తనకు ఇష్టమని కేంద్ర మంత్రి చెప్పడంతో.. తాము ఈ మధ్య చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్ రైస్‌ను కస్టమర్లకు అందిస్తున్నామని చెప్పిన బాబూరావు వెంటనే సాంబార్ రైస్ తెప్పించి తినాలని సంజయ్‌ను కోరారు.

సాంబార్ రైస్ చాలా బాగుందని పేర్కొన్న బండి సంజయ్ ఈ కేప్‌కు నీలోఫర్ అని పెట్టడానికి కారణమేంటని అడిగి తెలుసుకున్నారు. ‘నేను చాలా పేదరికం నుంచి వచ్చిన. 1976లో నీలోఫర్ ఆసుపత్రి వద్ద 2 రూపాయలకు చిన్న ఉద్యోగం చేసి.. అక్కడే టీ, బిస్కట్లు అమ్మిన. వాటికి గిరాకీ ఉండటంతో కేఫ్ స్థాపించాను. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నీలోఫర్ పుణ్యమే. అందుకే ఈ వ్యాపారానికి ఆ పేరే పెట్టిన. నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి కుటుంబాలకు ఉచిత భోజనం పెట్టి రుణం తీర్చుకుంటున్నా’ అని వివరించారు. ఈ సందర్భంగా బాబూరావు చేస్తున్న సేవలను బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *