Nirmal Collector
Nirmal Collector

Nirmal Collector: గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

Nirmal Collector: గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై ఆమె జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో శాంతి సమావేశం (పీస్ కమిటీ) నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగా జరుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్, భైసా, ఖానాపూర్ పట్టణాలలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గణేశ్ మండపం వద్ద విద్యుత్, జనరేటర్ సౌకర్యం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పట్టణ ప్రధాన వీధుల గుండా రహదారులకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. రహదారుల వెంబడి, మండపాల వద్ద విద్యుత్ వైర్లు వదులుగా ఉండకుండా చూడాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మల్ పట్టణంలో బంగల్‌పేట్ చెరువు వద్ద, అలాగే భైంసా పట్టణంలో గడ్డన్న వాగు ప్రాజెక్టు వద్ద బార్కెట్లు, క్రేన్లు, అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చేలా మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వినాయక ఉత్సవాలను ఘనంగా, శాంతియుతంగా జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ప్రతి గణేశ్ మండపం వద్ద సీసీ కెమెరాలతో పాటు నిరంతరం పోలీస్ బందోబస్తు, వలంటీర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదని, ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బెల్ట్ షాపులను మూసివేసేలా పోలీసు ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శోభాయాత్ర సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మొబైల్ టాయిలెట్స్, అంబులెన్స్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకునేలా హిందూ, ముస్లిం సోదరులు సహకరించాలని కోరారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఆర్వో భుజంగరావు, ఆర్డీవోలు కోమల్ రెడ్డి, రత్న కళ్యాణి, డీఎస్పీ గంగారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్, నిర్మల్, భైంసా ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు రాజు, రాజేశ్ కుమార్, మనోహర్, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *