Whip Laxman Kumar: ధర్మపురి, డిసెంబర్ 7 (మన బలగం): ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి హామీని అమలు చేసి పేదలకు ప్రయోజనం చేకూరుస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ధర్మపురి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి నంది చౌరస్తా, గాంధీ చౌరస్తా, హనుమాన్ విగ్రహం, చింతామణి చెరువు కట్ట మీదుగా ర్యాలీగా మార్కెట్ సభ స్థలికి చేరుకున్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా మంజూరైన రూ.5 కోట్ల 11 లక్షల 50 వేల చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సుమారు 35 లక్షల విలువగల 35 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
తదుపరి పారిశుధ్య కార్మికులకు కొబ్బరి నూనె, డబ్బులు మొదలగునవి పంపిణీ చేశారు. ధర్మపురి మండలానికి సంబంధించి 557 అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేసారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలను వీక్షించారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందన్నారు. ధర్మపురి నియోజకవర్గానికి నైట్ కాలేజీని పునఃప్రారంభించామన్నారు. చేగ్యం బాధితులకు రూ.18 కోట్ల పరిహారాన్ని అందజేసామని తెలిపారు. మున్సిపల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు టీఎఫ్ఐడీసీ కింద రూ.15 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, అదే విధంగా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరైందన్నారు. నవోదయ కళాశాల మంజూరుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. 2027లో జరగనున్న పుష్కరాలకు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా మరియు మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.