Street vendors: నిర్మల్, డిసెంబర్ 6 (మన బలగం): పట్టణంలో వీధి వ్యాపారులు తమకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే తమ వ్యాపారాన్ని నిర్వహించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయలు పండ్లు, పూలు ఇతర వీధి వ్యాపారస్తులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే తమ వ్యాపారాన్ని చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్లపై వ్యాపారాన్ని నిర్వహించరాదన్నారు. పట్టణంలో పార్కింగ్ సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని, పార్కింగ్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. షాపింగ్ మాల్, ఇతర వ్యాపార సముదాయాలలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాన్య ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. వెజ్, నాన్‌వెజ్ వ్యాపారులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే తమ వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. చేపల మార్కెట్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, మెప్మా పీడీ సుభాష్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.