Mokudebba Mahasabha: నిర్మల్, నవంబర్ 6 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా 4వ మహాసభలు జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల రాజేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలకు ముందు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన సభలో జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపతి లింగాగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బాలసాని నారాయణ గౌడ్, జాతీయ కమిటీ సభ్యులు కదిరె ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్, నాగరాజుగౌడ్, కాసారం మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లు గీత వృత్తి రక్షణకు గీత కార్మికులు రాజకీయ పార్టీలకతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాల ద్వారానే కల్లుగీత వృత్తి రక్షణ, రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు.
నిర్మల్ జిల్లాలో వీడీసీ, గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట గౌడ కులస్తులపై అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దీనిని వెంటనే అరికట్టాలని పిలుపునిచ్చారు. ఆబ్కారి శాఖ అధికారుల దాడులు అధికమయ్యాయని, వాటిని వెంటనే అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యలు, అబ్కారి అధికారుల దాడులపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి గీత కార్మికులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. కల్లుగీత కార్పొరేషన్‌కు కార్యవర్గాన్ని నియమించి ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలన్నారు. గీత కార్మికులకు సబ్సిడీపై రుణాలు అందించాలని కోరారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా నామకరణ వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నీరా కేఫ్‌ను ప్రైవేటు వ్యక్తుల నుంచి కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పజెప్పి రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేయాలని విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులకు కుల దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గౌడ కులస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవడంతో పాటు కల్లుగీత వృత్తిని రక్షించుకుంటూ రాజ్యాధికార వాటాలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా నిధులు కేటాయించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రమాద బీమాను 5 లక్షల నుంచి పది లక్షల పెంచి షరతులు లేకుండా రైతు బీమాలాగా అందజేయాలని కోరారు. ఏజెన్సీ గౌడ కులస్తులను ఎస్టీలుగా గుర్తించి వారి లైసెన్స్‌లను రెన్యువల్ చేయాలని కోరారు. ఈ మహాసభల అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారిని పూల మాలలు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ మాసభలలో రాష్ట్ర కమిటీ నాయకులు కొండ బాలా గౌడ్, పడాల రాజేందర్ గౌడ్, తీగల వెంకట్ గౌడ్ , ప్లావల గోపి గౌడ్, పీసర శ్రీనివాస్ గౌడ్, కొండగోని రవీందర్ గౌడ్, అక్కల గారి శ్రీనివాస్ గౌడ్, చేపూరి కనుక గౌడ్, యాగాండ్ల దశ గౌడ్, కొండ మురళి గౌడ్, సుంకరి శ్రీశైలం గౌడ్, తీగెల శ్రీనివాస్ గౌడ్‌లతో పాటు జిల్లాలోని వివిధ మండలాల్లోని గ్రామాల గౌడ కులస్తులు, గీత కార్మికులు 250 మంది పాల్గొన్నారు.