Semi Christmas: నిర్మల్, డిసెంబర్ 20 (మన బలగం): పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు.
శుక్రవారం నిర్మల్ పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ అవినాష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి, డీఎస్పీ గంగా రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ అని అన్నారు. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా వైభవంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అనంతరం సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.