రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య
caste enumeration: నిర్మల్, నవంబర్ 1 (మన బలగం): ప్రభుత్వం నిర్వహించే కుల గణనలో నమోదు చేసేటప్పుడు నాయక్, నాయక, నాయకపు అని కాకుండా నాయక పోడుగా అధికారులు నమోదు చేసుకోవాలని ఆదివాసి నాయక పోడు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడు నిజాం పాలనలో 1950 సంవత్సరంలో నాయక పోడులను తీసుకువచ్చి గోండు తెగలలో కల్పి, మా తెగకు అన్యాయం చేశారని, గోండు, నాయక పోడు తెగలను వేరువేరుగా జనాభా ప్రకటించాలని, గోండు తెగలో కలపడంతో తమ జనాభా లెక్కలలో లేకుండా పోయిందన్నారు. గతంలో ఆ విధంగా నమోదు చేయడం వలన ఇతర తెగలలో కలపడం వల్లన తమ జనాభాకు పూర్తిగా నష్టం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షలకుపైగా జనాభా ఉన్నా ప్రభుత్వం లెక్కల ప్రకారం చూస్తే జనాభా లేకపోవడంతో అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కుల గణన పూర్తయిన తర్వాత నాయక పోడు తెగ జనాభాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని, తమ తెగకు సీరియల్ నెంబర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇంటింటికి వస్తే తప్పనిసరిగా అధికారులకు వివరాలు ఇచ్చి సహకరించి మన తెగ నాయక పోడుగా నమోదు చేయించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటింటా చేపట్టనున్న సర్వేను అధికారులకు దగ్గరుండి సమాచారం అందజేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి మల్లేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు జాన్ సత్య నర్సయ్య, నవీన్ తదితరులు ఉన్నారు.