MLA Sanjay Kumar: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని, అకాల ప్రమాదాల నేపథ్యంలో ఇన్సూరెన్స్ వర్తించేందుకు లైసెన్స్ తప్పనిసరి అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం జగిత్యాల తాటిపల్లి ఆర్టీవో కార్యాలయంలో ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని కోరారు. రోడ్డు భద్రతా చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ రోడ్డు అంటారని తెలిపారు.
నేషనల్ హైవే అథారిటీ అధికారులను హైదరాబాద్‌లో కలిసి జగిత్యాల నుంచి చల్‌గల్ రోడ్డు వరకు రూ.18 కోట్ల కేంద్ర నిధులు మంజూరు చేయించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, కారు, జీపు వంటి వాహనాల్లో సీట్ బెల్ట్ ధరించి వాహనాన్ని నడపాలని కోరారు. వాహనదారులు వాహనాల ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, పాల్యూషన్, ఇన్స్యూరెన్స్ తదితర పత్రాలు ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో డీటీవో శ్రీనివాస్, ఎంవీఐలు రామారావు, వెంకన్న, ప్రమీలతోపాటు గ్రామ నాయకులు నాడేం శంకర్, అంజన్న, గంగారెడ్డి, శ్రీకాంత్, గిరి, అధికారులు తదితరులు ఉన్నారు.