NCC: నిర్మల్, నవంబర్ 24 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం 77వ ఎన్‌సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కేడెట్లు నిర్వహించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నిర్మల్ ప్రధాన వీధుల గుండా ఎన్‌సీసీ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేట్ ఎన్సిస్ ఆఫీసర్, ఫస్ట్ ఆఫీసర్ యాటకారి సాయన్న మాట్లాడుతూ.. భారతదేశ మొదటి అతిపెద్ద ప్రభుత్వ రంగ యువ సైనిక సైన్యంగా ఎన్‌సీసీ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే ఎన్‌సీసీలో చేరి వందలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి దేశ రక్షణలో భాగంగా ఆర్మీ, నేవి, వాయు, సైనిక దళ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని 24 పాఠశాలల్లో ఎన్‌సీసీ నడుస్తోందన్నారు. 3 జూనియర్ కాలేజీలు, 8 డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ శిక్షణ నడుస్తోందన్నారు. ఎన్‌సీసీ శిక్షణతో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ విద్యార్థులకు అలవాడతాయన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఎన్‌సీసీలో చేరి సత్‌ప్రవర్తన, క్రమశిక్షణ, సోదర భావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటున్నారన్నారు. ఎన్‌సీసీలో చేరిన విద్యార్థులకు 10 రోజుల ప్రత్యేక శిక్షణ క్యాంపు ఉంటుంది. అందులో ఫిజికల్ ఫిట్‌నెస్, డ్రిల్లు, వెపన్ ట్రైనింగ్, ఎన్‌సీసీకి సంబంధించిన విషయ పరిజ్ఞానం, సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో భాగస్వామ్యం అవుతారు. విద్యార్థులు ఎన్‌సీసీలో చేరి దేశ సేవకు అంకితం కావాలన్నారు. క్రమశిక్షణకు ఎన్‌సీసీ మారుపేరుగా నిలిచింది అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మధుసూదన్, మరియు ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు.