Shobhayatra: నిర్మల్, నవంబర్ 9 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహ ఊరేగింపు కన్ను పండువగా సాగింది. నిర్మల్ పట్టణంలో 84వ శ్రీ వైష్ణవ అయుత చండి, అతిరుద్ర హోమం కార్యక్రమాలు రెండ్రోజులుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి భారీ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద సరస్వతి కార్యక్రమానికి హాజరయ్యారు. పట్టణంలోని చైన్గేట్ హనుమాన్ ఆలయంలో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. రథంపై శ్రీకృష్ణుడి మూలవిరాట్టును ఉంచి స్వామీజీ ఆసీనులయ్యారు. పంచ హ్రస్వ రథం ముందు మహిళలు కోలాటాలతో సందడి చేశారు. మంగళహారతులతో అడుగడుగునా మహిళలు స్వాగతం పలికారు. పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. చైన్గేట్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర యాగశాల వరకు కొనసాగింది. యాగశాలలో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సూర్య సుదర్శన హోమములు, సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహా ఊరేగింపు విశేషంగా ఆకట్టుకుంది.