Metpally CI: మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సిఐ నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం సీఐ మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా రౌడీ షీటర్లు, ఆటంకం కలిగించే వారితో పాటు డీజే నిర్వాహకులను తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. మెట్‌పల్లిలో 96 మందిని, మల్లాపూర్‌లో 42 మంది, ఇబ్రహీంపట్నంలో 37 మందిని బైండో వేర్ చేశారు. కొత్తగా ఎవరైనా నిమజ్జనం రోజున అల్లర్లు చేసి ఆటంకం కలిగిస్తే వారిపైనా రౌడీ షీట్లు తెరుస్తామన్నారు. రౌడీ షీట్ల తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిమజ్జనం మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలు పెట్టి రాత్రి 11గంటల లోపు ముగించాలని సూచించారు. డీజె నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ బాక్సులు ఇవ్వొద్దని తెలిపారు. ఒకవేళ ఇస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు పెడతమని హెచ్చరించారు. మద్యం షాపులు మూసి ఉంచాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో కూడా ఎక్కడైనా మద్యం అమ్మితే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.