T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా ఒక్క రోజే మూడు మ్యాచులు అమెరికా(America), వెస్టిండీస్ (West Indies) వేదికల్లో జరగనున్నాయి. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో పపువా న్యూగినియా (Papua New Guinea), ఉగాండా(Uganda) మధ్య భారత కాలమానం ప్రకారం.. ఉదయం 5 గంటలకే మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఉదయం ఆరు గంటలకు ఆస్ట్రేలియా(Australia), ఓమన్(Oman) మధ్య కెన్నింగ్ టన్ ఓవల్ బార్బడోస్‌లో 10వ మ్యాచ్ జరగనుంది.
రాత్రి తొమ్మిది గంటలకు పాకిస్థాన్(Pakistan), యూఎస్ (US) మధ్య పోరు జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, యూఎస్ మ్యాచ్ డల్లాస్‌లోని గ్రాండ్ పార్లీ స్టేడియంలో ఇండియా టైం ప్రకారం.. రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభం అవనుంది. యూఎస్ఏ ప్లేయర్లలో ఎక్కువ మంది ఇండియన్ క్రికెటర్లు ఉండటం కెప్టెన్ కూడా ఇండియా సంతతి క్రికెటర్ మోనాంక్ పటేల్ కావడంతో అభిమానులు అమెరికాకే మద్దతు తెలిపే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 22 రన్స్ చేస్తే టీ 20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున ఎక్కవ పరుగులు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. అరోన్ పించ్ 3120 పరుగుల రికార్డును వార్నర్ బద్దలు కొట్టే అవకాశం ఈ మ్యాచ్‌లోనే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా టీంకు మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా ఉండగా.. ఓమన్‌కు అకిబ్ ఇల్లియాస్ సారథ్యం వహిస్తున్నాడు. ఓమన్ మొదటి మ్యాచ్‌లో నమీబియాపై పోరాడి ఓటమి చెందింది. సూపర్ ఓవర్‌లో నమీబియా బ్యాటర్లు చెలరేగి ఆడటంతో ఓమన్ ఓటమి చెందక తప్పలేదు.
ఆస్ట్రేలియాతో ఆడే అవకాశం రావడం ఓమన్‌కు కలిసొచ్చే అంశం కాగా.. అగ్రశ్రేణి జట్టుతో పోరాడాల్సి రావడంతో ఓమన్ కత్తి మీద సాము లాంటిది. పసికూనలైన ఉగాండా, పపువా న్యూ గినియా ఈ సిరీస్‌లో ఇప్పటికే వెస్టిండీస్ అఫ్గానిస్తాన్ చేతిలో చిత్తయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి రాబోయే మ్యాచ్‌లకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తున్నాయి.