ganja smugglers arrested: నిర్మల్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి తెలిపారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అదుపులోకి తీసుకొని విచారించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న సయ్యద్ అహ్మద్‌ను ఎస్సై డి.రమేశ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఆయన వద్ద 450 గ్రాముల గంజాయి లభించిందని డీఎస్పీ తెలిపారు. అబ్దుల్ ముక్తార్ వద్ద తాను కొనుగోలు చేసినట్లు సయ్యద్ అహ్మద్ తెలడంతో అబ్దుల్ ముక్తార్ ఇంట్లో తనిఖీ చేయగా 1100 గ్రాముల గంజాయి లభించిందని తెలిపారు. ఇరువురి వద్ద కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు మహారాష్ట్రలోని నాందేడ్‌లో గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై డి.రమేశ్, ఏఎస్ఐ బాబా రావు పాల్గొన్నారు.
గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు
గంజాయిని విక్రయించిన వినియోగించిన పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి హెచ్చరించారు. యువత గంజాయి మత్తులో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని అన్నారు. గంజాయి బారిన పడకూడదని సూచించారు.