Farmers protest: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామ రైతులు విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. గ్రామంలో 10 రోజులుగా కరెంటు కోతలు ఎక్కువ కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళనబాట పట్టారు. విద్యుత్ ఉపకేంద్రం 33/11ను ముట్టడించి బైఠాయించి నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా సమస్య ఉన్నా పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అదనపు ఫీడర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతులు దోమకొండ చిన్నరాజన్న, దొంతుల తుకారాం, బాయి లింగారెడ్డి, చెక్కిల అంజాగౌడ్, సల్కం చిన్న నర్సయ్య, ఉప్పులుటి రాజం, బాయి చిన్న రాజం, గుర్రు గంగాధర్, జంగ విజయ్, దోమకొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.