- శశాంక్ సింగ్‌ను వద్దనుకున్న పంజాబ్ కింగ్స్
- పొరపాటున కొనుగోలు చేసిన వైనం
- అతడే జట్టులో పెద్దన్న పాత్ర
SHASHANK, IPL 2024: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ (PBK) గత యాక్షన్‌లో ఆటగాళ్ల కొనుగోలుకు సంబంధించి చేసిన తప్పు వారికి మంచి చేస్తోంది. తప్పుల నుంచి కూడా మంచి జరుగుతుందంటే వినడమే కానీ ఎవరూ ప్రత్యక్షంగా చూసి ఉండరు. అయితే పంజాబ్ కింగ్స్ 19 సంవత్సరాల శశాంక్ సింగ్‌ను కొనబోయి 32 ఏండ్ల శశాంక్‌ను అనుకోకుండా కొనుగోలు చేసింది. దీంతో యాక్షన్ నిర్వహిస్తున్న వారిని తము తప్పుగా ఎంపిక చేసుకున్నామని మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరారు.
అయితే దానికి ఐపీఎల్ యాక్షన్ కమిటీ ఒప్పుకోలేదు. దీన్ని పంజాబ్ కింగ్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే ఎక్కడైతే తప్పుగా కొన్నారో.. ఎవరినైతే కాదనుకుని తీసుకున్నారో ఆ వ్యక్తే తన ఆట తీరుతో పంజాబ్ కింగ్స్ ఓనర్స్ నోరు మూయిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన మ్యాచ్‌లో 200 టార్గెట్ ఉన్నా అయిదు వికెట్లు పడ్డా కూడా ఎక్కడా కూడా బెదరకుండా 29 బంతుల్లోనే అయిదు సిక్సులు, నాలుగు ఫోర్లలో 61 పరుగులు చేసి జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు. దీంతో ఎవరీ శశాంక్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
అదే విధంగా శశాంక్ ఆటతీరు కూడా విదేశీ ఆటగాళ్ల కంటే బాగా ఉండటంతో ఇలాంటి ప్లేయర్లును కొనకూడదని నిర్ణయం తీసుకుంటారా అంటూ పంజాబ్ కింగ్స్ తీరుపై మండిపడుతున్నారు. శశాంక్ తర్వాత సన్ రైజర్స్ మ్యాచ్‌లో కూడా చెలరేగి ఆడాడు. జట్టును గెలిపించినంతా పని చేశాడు. దాదాపు రెండు పరుగుల తేడాతో మాత్రమే పంజాబ్ ఓడిపోయింది. ఆ మ్యాచ్లో కూడా విదేశీ ప్లేయర్లు, శిఖర్ ధావన్ లాంటి మేటి ఆటగాళ్లు ఆడకున్నా.. శశాంక్ మాత్రం తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అందుకే అవమానం జరిగిన చోటే అవమానించిన వారితోనే చప్పట్లు కొట్టించుకుంటే ఎలా ఉంటుందో శశాంక్ సింగ్ నిరూపించుకున్నాడు.