- కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే
- రేవంత్ రెడ్డి, కేటీఆర్ చేయాల్సింది పాదయాత్ర కాదు.. మోకాళ్ళ యాత్ర
- కాంగ్రెస్ వన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు
Bandi Sanjay Kumar: మన బలగం, తెలంగాణ బ్యూరో: ‘మూసీ పునరుజ్జీవంపైన సీఎం పాదయాత్ర చేస్తానంటున్నడు. ఇప్పుడేమో ట్విట్టర్ టిల్లు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాడట. ఈ రెండు పార్టీలు ఒక్కటే కదా? 6 గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక మోసం చేసిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ దైతే, 10 ఏళ్ల పాలనలో ప్రజలను అడుగడుగునా మోసం చేసిన ట్విట్టర్ టిల్లు ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ది. మీ ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు. మోకాళ్ల యాత్ర’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పిన బండి సంజయ్ ‘ఇద్దరూ కలిసి అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఇంకొకరు పాదయాత్ర చేసుకోండి. ఆ తరువాత మీరిద్దరూ కలిసి బహిరంగ సభ పెట్టుకుని రాహుల్ గాంధీ, కేసీఆర్‌లను పిలుచుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే 6 గ్యారంటీలపై పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లో శుక్రవారం పర్యటించిన బండి సంజయ్ కుమార్ స్థానిక బీజేపీ నేతలను కలుసుకున్నారు. కార్యకర్తలతో ముచ్చటించారు. అనంతరం బెజ్జంకి మండల కేంద్రం పార్టీ మండలాధ్యక్షుడు రవి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డితో పాటు స్థానిక నేతలతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందే రాజకీయాలు. ఆ తరువాత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నా. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అందరితో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్నా. గత ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఆలోచించిందో తెలిసింది. మేం సహకరిస్తామని చెప్పినా చేయలేదు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాదయాత్రపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘రెండు పార్టీలు ఒక్కటే కదా? ఇద్దరూ కలిసి అటు నుంచి ఒకరు, ఇటు నుంచి ఇంకొకరు పాదయాత్ర చేసుకోండి. కలిసే బహిరంగ సభ పెట్టుకుని కేసీఆర్‌ను, సోనియాగాంధీని పిలుచుకోండి. 10 ఏళ్లలో ప్రజలను ఏ విధంగా మోసం చేశామో, అవినీతికి పాల్పడ్డామో బీఆర్ఎస్ నేతలు చెప్పుకోండి.
6 గ్యారంటీలపై ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినంక వాటిని అమలు చేయకుండా దాటవేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్పుకోండి. సిగ్గుండాలే. మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు.. రెండు పార్టీల నేతలు మోకాళ్ల యాత్ర చేయాలి. బీఆర్ఎస్ హయాంలో నేను పాదయాత్ర చేస్తే మాపై దాడి చేయించింది బీఆర్ఎస్ గూండాలు కాదా? ప్రజలు తిరగబడితే ఆనాడు తోక ముడిచారు. అట్లాంటి మీరు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు? అసలు దేనికోసం పాదయాత్ర చేస్తున్నరు? రైతుల సమస్యలపై ఏనాడూ స్పందించలే. నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజా సమస్యలపై ఏనాడూ నోరే విప్పడం లేదు? ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న కేసీఆర్ 6 నెలలుగా ఫాంహౌజ్‌కే పరిమితమైండు. కుటుంబానికి ఆపదొస్తే తప్ప నోరు విప్పడు. మరి ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు? మూసీపై పాదయాత్ర చేస్తానంటున్న రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు చేశామని చెప్పుకుంటూ పాదయాత్ర చేసే దమ్ముందా? నిజంగా అట్లా చేస్తే ప్రజలే తిరగబడతరు.
రైతు భరోసా ఇవ్వకుండా గోస పెడుతున్నరు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500లు ఇస్తానని మోసం చేసిండు. 6 గ్యారంటీల పేరుతో ఓట్లేయించుకుని నిలువునా మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలిస్తామని మోసం చేశారు. ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఇవ్వకుండా మోసం చేసిండు. ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా కాలేజీలు మూసివేసే పరిస్థితి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గద్దెనెక్కినంక చేతులెత్తేసి సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తానంటారా? అసలు కాంగ్రెస్ వన్నీ ఉత్తి మాటలే. ఉత్తర కుమార ప్రగల్భాలే. వాళ్ల చేతలకు మాటలకు పొంతనే లేదు. దీపావళికి ముందే రాజకీయ బాంబులు పేలుతాయన్నరు. పండుగనాడు అందరి ఇండ్లలో పటాకులు పేలినయ్ కానీ, కాంగ్రెసోళ్ల రాజకీయ బాంబు మాత్రం పేలలే. తుస్సుమంది. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒక్కటే.
కలిసి డ్రామాలాడుతున్నయ్. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకలపై పైకి విచారణ చేసి బొక్కలో వేస్తమని ప్రకటనలిస్తరు. కాళేశ్వరం, ధరణి, గొర్రెల స్కాం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ విచారణలో కేసీఆర్ కుటుంబం దోషులని మాట్లాడతరు. దీపావళికి ముందే రాజకీయ బాంబులు పేలుతయంటరు. బీఆర్ఎస్ పెద్దలు అరెస్ట్ కాబోతున్నరని ప్రభుత్వంలో ఉన్నోళ్లే బహిరంగంగానే మాట్లాడతరు. కానీ అరెస్టులు కాదు కదా.. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేకపోయారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా, అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నరు. రూ.లక్షన్నర కోట్లు దోచుకునే కుట్రకు తెరదీస్తున్నరు. వీటిపై మేం నిలదీస్తుంటే.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుండే యుద్దం ప్రారంభించిందని అనడం సిగ్గు చేటు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కల్ల. ప్రధాని కాలేడనే విషయం రాహుల్‌కు కూడా తెలుసు. ప్రజలకు ఇంకా బాగా తెలుసు. యుద్దం సంగతి తరువాత.. యుద్ద ప్రాతిపదికన ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి మీ దమ్ము చూపండి.’ అని ప్రశ్ర్నించారు.