చిన్న పత్రికల బలోపేతానికి ప్రభుత్వం సహకరించాలి
TSJU: నిర్మల్, నవంబర్ 29 (మన బలగం): ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న పాత్రికేయుల కోసం పది లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయం కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని కోరారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా జర్నలిస్టు కమిటీ సమావేశం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ ప్రతి నిత్యం సమస్యలతో సహజీవనం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టుల రక్షణ కోసం రూ.10 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. దాడులకు గురవుతున్న జర్నలిస్టుల రక్షణ కోసం జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించి అమలు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, తప్పుడు కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈ చట్టం తీసుకురావాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల కీలక ప్రసంగం చేశారు. సంస్థ యొక్క లక్ష్యాలు, విధి విధానాలను సభ్యులకు వివరించారు. సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాజ్ పటేల్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చింతలపల్లి బాపురెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి జి.నరేశ్, ఉపాధ్యక్షులు డి.రాజేందర్ తదితరులు హాజరయ్యారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
చిన్న పత్రికలను తక్షణమే గుర్తించి, వాటిని ఎమ్పానెల్మెంట్లో చేర్చాలని కోరారు. సంక్షేమ పథకాలలో యూనియన్ల జోక్యం లేకుండా చూడాలని, జర్నలిస్టుల సంక్షేమ పథకాలు నేరుగా అమలు చేయాలని, యూనియన్ల జోక్యం లేకుండా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. మీడియా రంగానికి ప్రత్యేక పాలసీ రూపొందించి జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. మీడియా ఉద్యోగుల సంక్షేమం, జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన బీమా, పెన్షన్, మరియు ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
టీఎస్జేయూ నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా చౌహాన్ సుదర్శన్, ఉపాధ్యక్షులుగా టి.రాజేందర్, జే.హనుమాన్లు, టి.ఫణింధర్, ప్రధాన కార్యదర్శిగా జి.సురేశ్, సంయుక్త కార్యదర్శిగా టి.మధుకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.సూర్యకాంత్, కోశాధికారిగా కార్యవర్గ సభ్యులుగా షేక్ కాజా మోహినుద్దీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.