Opening of Nursing College: నిర్మల్, డిసెంబర్ 2 (మన బలగం): ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. వర్చువల్ పద్ధతిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంత్రులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ప్రారంభించగా, స్థానికంగా జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలిచి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో పేద ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కళాశాలలోని అన్ని సౌకర్యాలను వినియోగించుకుంటూ చక్కగా విద్యను అభ్యసించాలన్నారు. నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసినందుకు విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శకుంతల, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఎన్ఎంసీ నోడల్ అధికారి సునీల్, తహసీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.