Group-II Exams: నిర్మల్, డిసెంబర్ 12 (మన బలగం): గ్రూప్-2 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, లోకల్ రూట్ ఆఫీసర్లు, జాయింట్ రూట్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 15, 16న నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షలకు జిల్లాలో 8080 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు గాను నిర్మల్ పట్టణంలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీరు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష పత్రాల రవాణా భద్రతపై పర్యవేక్షణ చేయాలన్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు. అనంతరం గ్రూప్-2 నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రీజినల్ కో-ఆర్డినేటర్ పీజి రెడ్డి, చీఫ్ సూపరిండెంట్లు, అబ్జర్వర్లు, రూట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.