Congress rally: జగిత్యాల, ఫిబ్రవరి 3 (మన బలగం): ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష చూపిందని, నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కుమార్, జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపినా కేంద్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు నిర్మాణం వంటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ర్టానికి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.