Collector Sandeep Kumar Jha
Collector Sandeep Kumar Jha

Collector Sandeep Kumar Jha: గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదవాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

  • చీర్లవంచ పాఠశాల ఆకస్మిక తనిఖీ
  • తంగళ్లపల్లి ఆరోగ్య కేంద్రం సందర్శన

Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 6 (మన బలగం): గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేలా చూడాలని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పరిధి తెనుగువారిపల్లెలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, గ్రామంలోని రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం తరగతి గదులు, మధ్యాహ్నం భోజనం సిద్ధం చేస్తుండగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. వాటర్ ప్యూరిఫైర్, ఫ్యాన్లు మరమ్మతులు చేయించి, అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలకు మంచి భవనం ఉందని, కానీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్నారు. గ్రామంలోని పిల్లలందరూ ఇదే పాఠశాలలో చదివేలా చూడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన, సాంకేతికతతో కూడిన బోధనపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులు చదువులో రాణించేలా క్రమశిక్షణతో కూడిన బోధన అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కార్తిలాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి
ప్రభుత్వ వైద్యశాలల్లోనే 75 శాతం ప్రసవాలయ్యేలా చూడాలని వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీ.హెచ్.సీ) కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీ.హెచ్.సీ ఆవరణలో గడ్డి, నిరుపయోగ మొక్కలు పెరగడంతో వాటిని తొలగించాలని ఎం.పీ.ఓ.ను ఆదేశించారు. పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. సీసీ కెమెరాలకు మరమ్మతు చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అనంతరం పీ.హెచ్.సీలోని ఓ.పి. ఇతర రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ ఆయా గదులను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని 75 శాతానికి పైగా ప్రసవాలు ఇక్కడే జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏ.ఎన్.ఎం., ఆశా కార్యకర్తలతో నిత్యం సమావేశం ఏర్పాటు చేస్తూ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అఫిజా బేగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *