- స్కూల్ డేస్ నుంచే మత్తుకు బానిస
- మత్తులో చిత్తవుతున్న యువత
- అనతి కాలంలోనే మరణాలు
- గంజాయిని అరికట్టడంలో అధికారులు విఫలం
Ganjai: మల్యాల, ఫిబ్రవరి 10 (మన బలగం): మల్యాల మండలంలో యువత గంజాయి మత్తులో జోగుతోంది. ఈ దుర్వ్యసనానికి అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటోంది. గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. అయితే ఆ వ్యక్తి గంజాయిని రోజులో ఎన్నిసార్లు తీసుకుంటాడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో గంజాయి వినియోగం భారీగా పెరిగింది. ప్రతి రోజూ గంజాయి పట్టుబడ్డ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఈ దురలవాటును యువత మానుకోలేకపోతున్నది. ప్రస్తుతం స్కూల్ డేస్ నుంచే గంజాయికి బానిసలుగా మారడం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక కాలేజీ వరకు వస్తే విచ్చలవిడిగా ఈ వ్యవహారం నడుస్తుంది.
తల్లిదండ్రుల పాత్ర
ముఖ్యంగా తమ పిల్లలు ప్రతి రోజూ ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థిత్తుల్లో తమకు ఉన్న పని భారం, ఇతర ఒత్తిడి వలన తల్లిదండ్రులు తమ పిల్లలను సరైన పరిశీలించడం లేదు. పిల్లలు తమ స్నేహితుల ద్వారా గంజాయిని అలవాటు చేసుకుంటున్నారు. మొదటగా కొంచెం మోతాదులో గంజాయి వాడకం అలవాటు చేసుకొని తర్వాత సర్వం గంజాయికి బానిసగా మారుతున్నారు. తల్లిదండ్రులకు సరియైన అవగాహన రావడం లేదు. పిల్లలను ప్రతి సారి తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉన్నది.
కఠిన శిక్షలు.. అయినా ఆగని దందా
నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్స్స్ యాక్ట్ 1985 ప్రకరం గంజాయి చట్టవిరుద్ధమైన పదార్థంగా వర్గీకరించింది. 1985లోని సెక్షన్ ప్రకారం వైద్యపరంగా గాని శాస్త్రీయ పరంగా ఉపయోగించడం తప్ప ఇతర గంజాయి అమ్మకం, వినియోగం, ఉత్పత్తి రవాణా చట్టవిరుద్దం. సెక్షన్ 20 ప్రకారం గంజాయి సాగు చేసినవారికి 10 సంవత్సరల వరకు జైలు శిక్ష మరియు లక్ష రూపాయలు జరిమానా విధించవచ్చు. తక్కువ పరిమానంలో అనగా 100 గ్రాముల గంజాయి దొరికితే ఆరు నెలల నుంచి సంవత్సరల వరకు జైలు శిక్ష మరియు పది వేల రూపాయలు జరిమానా విధించవచ్చు. ఇలా గంజాయి పరిమానం బట్టి శిక్షలు అమలులో ఉన్నాయి.
అధికారులు ఏం చేస్తున్నారు?
విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల ఉదాసీన వైఖరి యువతకు శాపంగా పరిణమిస్తోంది. గంజాయి సాగును, విక్రయాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. మల్యాల మండలంలో గంజాయి విక్రయాలు సాగుతున్నా అధికారుల పట్టింపులేని తనం స్మగ్లర్లకు వరంగా మారుతోంది. గంజాయిని వివిధ రూపాల్లో చాక్లెట్లు, లిక్విడ్, పొడి తదితర వాటిని విక్రయిస్తున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా అధికారులకు పట్టడంలేదు. ఇప్పటికైనా అధికారులు గంజాయిపై ఉక్కుపాదం మోపి యువత భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.