Rock Salt
Rock Salt

Rock salt: ఈ ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పు లేదు

  • రాక్ సాల్ట్‌తో అనేక ప్రయోజనాలు
  • నిర్మల్‌లో జోరుగా విక్రయాలు

Rock salt: నిర్మల్, ఫిబ్రవరి 28 (మన బలగం): అతిగా ఉప్పును వినియోగిస్తే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఉప్పును వినియోగించకుండా ఉండలేము. ఉప్పు లేనిదే ముద్ద దిగదు. ఆరోగ్యానికి ముప్పే అని తెలిసినా ఉప్పును వినియోగించకుండా ఉండలేం. కానీ ఈ ఉప్పును వినియోగిస్తే మన ఆరోగ్యాలకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు. ఇది వినడానికి వింతగానే ఉన్నా ముమ్మాటికీ నిజం. ఆ ఉప్పు రాక్ సాల్ట్. అవును రాక్ సాల్ట్ వినియోగంతో ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదు. వైద్యులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఈ రాక్ సాల్ట్‌ను సైతం మితంగా వినియోగిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతామని వైద్యులు అంటున్నారు.

రాక్ సాల్ట్‌లో రకాలు
రాళ్ల ఉప్పు (రాక్ సాల్ట్)లోనూ రకాలు ఉన్నాయి. వాటిలో తెల్ల రాళ్ల ఉప్పు, నల్ల రాళ్ల ఉప్పు రెండు రకాలుగా ఉన్నాయి. రెండు రకాలు వేరువేరుగా వినియోగించడం వల్ల దేని ఫలితాలు దానికి వస్తాయని విక్రేతలు చెబుతున్నారు.

వైట్ రాక్ సాల్ట్
వైట్ రాక్ సాల్ట్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని తెలుస్తోంది. రోజూ వాడే ఉప్పుకు ఈ రాక్ సాల్ట్‌కు తేడా ఉంటుంది. రోజూ వాడే ఉప్పును శుద్ధిచేసి వాటిలో కొన్ని రకాల రసాయనాలను కలుపుతారు. దీంతో ఎక్కువ కాలం గడ్డకట్టకుండా పొడిపొడిగా ఉండేందుకు ఈ రసాయనాలు పనిచేస్తాయి. ఉప్పులో సహజంగా ఉండాల్సిన కొన్ని మినరల్స్ శుద్ధి చేసే సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. రాక్ సాల్ట్‌ను శుద్ధి చేయకుండా వినియోగించడం వల్ల ఉప్పులో ఉండాల్సిన సహజ గుణాలను కోల్పోకుండా అన్ని మినరల్స్‌ను అందిస్తుంది. వైట్ రాక్ సాల్ట్ కొండల నుంచి నేరుగా తీసి విక్రయిస్తారు. వైట్ రాక్ సాల్ట్‌ను భోజనంలో చపాతి, చట్నీ, సాంబారు, కూరగాయల వంటల్లో వినియోగించడం వల్ల బీపీతో పాటు రక్తం శుభ్రపరచడంలో సహాయకారిగా పనిచేస్తుంది.
బ్లాక్ రాక్ సాల్ట్ (కరివేపాకు ఉప్పు)
బ్లాక్ రాక్ సాల్ట్ వినియోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీన్ని వినియోగించడం వల్ల అజీర్ణం, కీళ్ల నొప్పులు, బీపీ లాంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలుస్తోంది. ఈ ఉప్పును పెరుగు, మజ్జిగ, రోజు వారీ వంటలతో పాటు పానీ పూరి, చాట్ మసాలా తదితర తిను పదార్థాలలో దీనిని వినియోగించుకోవచ్చు. ఉప్పు లేని లోటును తీర్చుకోవడం తోపాటు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Rock Salt
Rock Salt

ఎక్కడ దొరుకుతుంది
రాక్ సాల్ట్ పంజాబ్ ప్రాంతం నుంచి కొందరు వ్యాపారులు తెచ్చి నిర్మల్‌లో విక్రయిస్తున్నారు. పంజాబ్ ప్రాంతంలో కొండల నుంచి నేరుగా తీసుకొని వచ్చామని వారు తెలిపారు. తెల్ల ఉప్పు నేరుగా లభించగా నల్ల ఉప్పు మాత్రం బట్టి పెట్టీ తయారు చేస్తామని పంజాబ్ వ్యాపారి కరణ్ రామ్ తెలిపారు. తెల్ల ఉప్పు కన్నా నల్ల ఉప్పులో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని ఆయన వివరించారు.

Ayurvedic doctors Ravi Alladi
Ayurvedic doctors Ravi Alladi

మితంగా వాడితే ఫలితాలు: ఆయుర్వేద వైద్యులు రవి అల్లాడి
రోజూ వాడుకునే ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉప్పు వినియోగం ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదైనా మితంగా వాడితేనే ప్రయోజనాలు కలుగుతాయి. రాక్ సాల్ట్ వినియోగం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుందని, రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా పనిచేస్తుందని అన్నారు. ప్రధానంగా రాక్ సాల్టును వినియోగించడం వల్ల శరీరానికి అందాల్సిన అన్ని రకాల మినరల్స్ అందే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఏది ఏమైనా ఉప్పు వినియోగం ఆరోగ్యానికి అంతా మంచిది కాదని, ఏదైనా మితంగా వాడితేనే మంచిదని సూచించారు. రాక్‌సాల్ట్‌ను ఆయుర్వేదిక్ మందుల తయారీలోనూ వినియోగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *