Right to Information Act: నిర్మల్, ఆగస్టు 12 (మన బలగం): సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బుధవారం జిల్లాలో రాష్ట్ర సమాచార కమిషన్ బృందం పర్యటన నేపథ్యంలో శాఖల వారీగా ఇప్పటివరకు నమోదైన దరఖాస్తులు, వాటి పరిష్కారం, పెండింగ్ కేసులు తదితర అంశాలను అధికారులు పరిశీలించాలన్నారు. అన్ని శాఖల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో) తప్పనిసరిగా ఉండాలని, 4(1) బీ రిజిస్టర్‌ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రేపు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులపై కమిషన్ బృందం విచారణ చేపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
