Ban on Private Schools: ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయాలని, ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నూనెల శ్రీనివాస్ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడులు బాగుపడాలన్నా, సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, అధికారులు, టీచర్లు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలని కోరారు. అలా చేయని ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని, ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలా చేయడం ద్వారా టీచర్లు సక్రమంగా చదువులు చెప్పడం, ప్రభుత్వం వసతులు సౌకర్యాలు కల్పించడం లాంటివి జరుగుతాయన్నారు. అంతేకాకుండా బీద, పేద, మధ్య, ధనిక పిల్లలందరికీ ఒకే రకమైన చదువు అందటం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని డిమాండ్ చేశారు.
