- చివరి మజిలీకి తప్పని తిప్పలు
- వర్షా కాలంలో ఉపయోగపడని శ్మశానవాటికలు
- రోడ్డుపైనే శవాల దహనం కార్యక్రమం
- గోదావరి నది నీటిలోనే శ్మశాన వాటిక
Godavari river crematorium submerged monsoon issues in Khanapur: గత ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మాణం చేసిన శ్మశాన వాటికలు నిరుపయోగంగా మారుతున్నాయి. గోదావరి నదిలో నిర్మాణం చేసిన ఈ శ్మశాన వాటిక వర్షా కాలంలో పూర్తిగా నీటిలో ఉండటంతో శవాలను రోడ్డుపైనే దహన సంస్కారాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కనీసం చనిపోయిన తర్వాత చివరి మజిలీ అయినా ప్రశాంతంగా జరుగాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ చివరి సారిగా అంత్యక్రియలకు తిప్పలు తప్పటం లేదని పలువురు వాపోతున్నారు.
గోదావరి నదిలోనే ఉన్న శ్మశానవాటిక
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో సమీపంలో గల గోదావరి నదిలో నిర్మాణం చేసిన ఈ శ్మశాన వాటిక నీటి ప్రవాహంలో ఉంది. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. అయితే పట్టణంలో ఎవరైనా చనిపోతే గోదావరి తీరానికి తెచ్చి దహనం సంస్కారాలు చేస్తారు. ఖననం, దహనం చేయటానికి వేరే స్థలం లేని దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నదిలో ఇంకా ప్రవాహం తగ్గక పోవటంతో అక్కడే ఒడ్డుపైన దహనం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్థలం లేక నది ఒడ్డు, పొలం గట్లను వెతికి ఖననం, దహనం చేయాల్సిన దుస్థితి పరిస్థితి ఉంది. కొన్ని సమయాల్లో రెండు, మూడు శవాలు ఒకే రోజు వస్తే దహనం చేసేందుకు కుటుంబసభ్యులు ఇబ్బంది పడ్డారు. కాలుతున్న శవాలు నీటి ప్రవాహంలోనే కొట్టుకుపోయిన దారుణ సంఘటన లున్నాయి.
అనాలోచితంగా నిర్మించారు
గోదావరి నదిలో ఈ శ్మశానవాటికను అనాలోచితంగా నిర్మాణం చేసారని పలువురు పేర్కొంటున్నారు. నిర్మాణ సమయం పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన పట్టించుకోలేదని అంటున్నారు. శ్మశాన వాటికను పూర్తిగా నదీ ప్రవాహం ప్రాంతంలోనూ కట్టటం వలన పలు సందర్భాల్లో వరద తాకిడికి అక్కడ కట్టిన గదులు కొట్టుకుపోయాయి. ప్రతి ఏటా వర్షాకాలం గోదావరి వరద ప్రవాహానికి శ్మశానవాటిక నీటిలో మునిగి ఉంటుంది. ఈ సారి నెల రోజుల నుంచి వరద తగ్గకుండా కొనసాగుతుంది. దీంతో శ్మశానవాటిక అప్పటి నుంచి వరద ప్రవాహంలోనే ఉంటుంది. అయితే మరణించిన వారి శవాలకు ఛితి పేర్చి రోడ్డుపైనే దహనం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ విషయమై దృష్టి సారించి, నది ఒడ్డున స్థల సేకరణ చేసి శ్మశాన వాటిక నిర్మాణం చేయాలని కోరుతున్నారు.

