- రూ.లక్షలు చెల్లించి నష్టపోయిన యువకులు
- ప్రజావాణిని ఆశ్రయించిన బాధితులు
Job fraud overseas employment scam Hyderabad consultancy victims: విదేశాల మోజులో పడిన పలువురు యువకులు ఏజెంట్ చేతిలో మోసపోయారు. దీనితో తమను ఆదుకోవాలని న్యాయం చేయాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సంప్రదించి వేడుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం గోపాల్‌పేట్‌కు చెందిన మణి శ్రావణ్, ధని గ్రామానికి చెందిన రాం శ్రీధర్, మెదక్ జిల్లాకు చెందిన తిమ్మారెడ్డిగారి శ్రవణ్ కుమార్ రెడ్డి అనే ముగ్గురు యువకులు ఇటలీ, న్యూజిలాండ్‌లలో ఉద్యోగాల ప్రయత్నం చేసి హైదరాబాద్‌లోని రెండు కన్సల్టెన్సీల చేతిలో మోసపోయారు. ఈ ముగ్గురు యువకులు సహాయం కోసం, హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్‌లో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దరఖాస్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి వారికి మార్గదర్శనం చేశారు. సీఎం ప్రజావాణి ప్రత్యేక పోలీస్ అధికారి (డీఎస్పీ) ఉమేందర్‌తో వారు తమ గోడు వినిపించారు. కేసు నమోదు చేయాల్సిందిగా హైదరాబాద్ లోని నాగోల్ పోలీసులకు, హోంశాఖ కౌంటర్ ద్వారా సూచనలు జారీ చేశారు. మణి శ్రవణ్ రూ.13 లక్షలు, రాం శ్రీధర్ రూ.12 లక్షలు, తిమ్మారెడ్డిగారి శ్రవణ్ కుమార్ రెడ్డి రూ.13 లక్షలు, రెండు కన్సల్టెన్సీలకు చెల్లించి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.