Nirmal district national awards Jal Sanchay Pemba block tourism village
Nirmal district national awards Jal Sanchay Pemba block tourism village

Nirmal district national awards Jal Sanchay Pemba block tourism village: ఉత్తమ పనితీరుకు వరించిన అవార్డులు

Nirmal district national awards Jal Sanchay Pemba block tourism village: నిర్మల్ జిల్లా కొన్ని రోజులుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు సాధిస్తూ వస్తోంది. జిల్లా ఖ్యాతి దేశవ్యాప్తంగా విరాజిల్లుతోంది. జిల్లా ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరుతో ఎంతో గొప్ప పేరు సంపాదిస్తూ, ఎన్నో అవార్డులు, రివార్డులు సొంత చేసుకుంటుంది. దీనంతటికి జిల్లా అధికారుల కార్యదీక్షనే కారణం. ముఖ్యంగా ఏడాది కాలంలో మూడు రంగాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి. జల్ సంచాయ్ – జన భాగిధారి, పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాలు, బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు జిల్లాకు దక్కడం గర్వించదగ్గ విషయం.

జల్ సంచాయ్ – జన భాగిధారి కార్యక్రమంలో ఉత్తమ స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా

భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా చేపట్టిన జల్ సంచాయ్ – జన భాగిధారి కార్యక్రమంలో భాగంగా తీసుకున్న చర్యలకు గాను నిర్మల్ జిల్లా దేశవ్యాప్తంగా అపార ఖ్యాతి గడించింది. వర్షపు నీటి సంరక్షణ, మెరుగైన ప్రజల భాగస్వామ్యంలో భాగంగా నిర్దేశించిన అన్ని పనులు పకడ్బందీగా పూర్తిచేసినందుకు గాను కేటగిరి -2లో జిల్లాకు జాతీయ స్థాయిలోనే రెండో ర్యాంకు సాధించి, కోటి రూపాయల నగదు బహుమతి సొంతం చేసుకుంది. ఇది జిల్లాకు ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమం ప్రతిపాదించిన నాటినుంచి అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పనిచేశారు. జల సంరక్షణలో భాగంగా చెరువులు, వాగులు, వానజలాల హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, చెక్‌డ్యాంల నిర్మాణం, వాటికి మరమ్మత్తులు చేపట్టి, భూగర్భజలాలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా ఉన్నతాధికారుల మెప్పు పొందాయి. కార్యక్రమాలలో ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేయడంతో ఈ విజయం సొంతమైంది. దేశ వ్యాప్తంగా నిర్మల్ జిల్లా రెండో ర్యాంకులో నిలవడం ఎంతో గొప్ప విషయం. ఇది అధికారుల కృషి, నిబద్ధతకు, ప్రజల భాగస్వామ్యానికి కొలమానం.

పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ విజయంతో పెరిగిన జిల్లా ఖ్యాతి

ఇటీవలి నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా పెంబి బ్లాకు జాతీయస్థాయిలోనే నాలుగవ స్థానంలో నిలిచినందుకు కాంస్య పతకం లభించింది. దీంతో జిల్లా పేరు మరొక్కసారి దేశవ్యాప్తంగా ఖ్యాతిని గడిచింది. నీతి అయోగ్ యాస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత వెనుకబడిన 500 మండలాలను ఎంపిక చేసింది. జిల్లాలోని పెంబి బ్లాకు ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో ఒక బ్లాకుగా ఎంపికైంది. ప్రభుత్వం ఈ బ్లాకుల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ఎంపిక కాబడిన పెంబి బ్లాకులో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సూచనలతో అధికారులంతా ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికై కృషి చేశారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా. మూడు నెలల పాటు అభివృద్ధి కార్యక్రమాలు యజ్జంలా నిర్వహించారు.

వ్యవసాయ, వైద్య, విద్యా, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ, తదితర శాఖల అధికారులు త్రైమాసిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం విషయాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మధుమేహం, రక్తపోటు, పోషక లోపాల నివారణ అంశాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆరు సూచికలలో భాగంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమ అమలుకు ముందు, తర్వాత చూసుకుంటే గుణాత్మక మార్పులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో చేపట్టిన కృషికి గాను, జాతీయస్థాయిలోనే మెరుగైన ఫలితాలను సాధించి నాలుగవ స్థానంలో నిలిచింది. ఇందుకుగాను కాంస్య పతకం లభించింది. ఇప్పుడు ఈ పెంబి మండలం ఆకాంక్షిత మండలం నుంచి మార్గదర్శక మండలంగా మారింది. పెంబి బ్లాకు జాతీయ స్థాయిలోనే నాలుగవ స్థానంలో నిలిచింది.

ఉత్తమ పర్యాటక ప్రాంతంగా నిలిచిన నిర్మల్

ఉత్తమ హస్తకళల విభాగంలో బెస్ట్ టూరిజం విలేజ్‌గా నిర్మల్ జిల్లా నిలిచింది. 27 సెప్టెంబర్, 2024న, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో పర్యాటక రంగానికి సంబంధించి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కొయ్య బొమ్మల పునరుజ్జీవనానికి, హస్తకళలు కాపాడేందుకు అధికారులు చేపట్టిన చర్యలకు గాను బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు లభించింది. ఈ అవార్డులు, రివార్డులే కాకుండా, రాష్ట్రస్థాయిలోనూ పలు శాఖల పనితీరులో నిర్మల్ జిల్లా ఉత్తమ స్థానంలో నిలుస్తూ వచ్చింది. ఈ ఫలితాలన్నీ అధికారుల కృషికి, నిదర్శనం. ఈ ఉత్తమ ఫలితాలు భవిష్యత్తులో వివిధ శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఎంతగానో స్ఫూర్తిని నింపుతున్నాయి.

అవార్డులు జిల్లాకు గర్వకారణం

‘గడిచిన ఏడాది కాలంలోనే జిల్లాలోని వివిధ శాఖల్లో చేపట్టిన పనులకు మూడు రంగాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు లభించాయి. ఇది జిల్లా అధికారుల కృషి, నిబద్ధతకు నిదర్శనం. జిల్లా చరిత్రలో మైలురాయి. పలు రంగాల్లో ఎన్నో విజయాలు సాధించేలా ప్రోత్సహించిన జిల్లా పూర్వపు ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రస్తుత జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులకు ధన్యవాదాలు. వీరి ప్రోత్సాహం మరువలేనిది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అందరూ కలసి నీటి సంరక్షణలో చేసిన కృషికి గాను జల్ సంచయ్ – జన భాగిధారి కార్యక్రమంలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ లభించింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం.

కొద్దిరోజుల క్రితమే నీతి ఆయోగ్ పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో చేపట్టిన పనులకు గాను జాతీయస్థాయిలోనే నాల్గవ స్థానం లభించింది. కాంస్య పథకం రావడం గొప్ప విషయం. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో చేపట్టిన పనుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కొయ్య బొమ్మల పరిరక్షణలో భాగంగా చేపట్టిన చర్యలకు గాను, నిర్మల్ జిల్లా బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డును సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు జిల్లాకు లభించడం సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో మరిన్ని రంగాల్లో జాతీయస్థాయిలో అగ్రస్థానం సాధించేలా కృషి చేస్తాం. ప్రజలందరినీ అన్ని కార్యక్రమాల్లో విస్తృతంగా భాగస్వామ్యం చేస్తాము. ప్రజలకు, అధికారులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.’ అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *