road accident: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 25 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బండ లింగంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బండ లింగంపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ షాహిద్ (26) అనే దివ్యాంగుడు తన వ్యక్తిగత పనులపై హ్యాండీక్యాప్డ్ వెహికల్‌లో ఎల్లారెడ్డిపేటకు వచ్చి తిరుగు ప్రయాణంలో నారాయణపూర్ రైస్‌మిల్ వద్ద వాహనం బోల్తా కొట్టి రోడ్డుపై పడి ఉన్నాడు. ఆర్టీసీ బస్సులో వెళ్తున్న తోటి గ్రామస్తులు అతడిని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మృతుని సోదరి ఆసియా, షాహిద్ వద్దకు వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు అపస్మారక స్థితిలో పడి ఉన్న సోదరుణ్ణి చూసి మొదట ఎల్లారెడ్డిపేట పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు మృతిని సోదరి ఆసియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.