- నిర్మల్ జిల్లాలో మూడు ముక్కలాట
- ముధోల్ సెగ్మెంట్‌లో నేతల మధ్య సవతిపోరు
- ఖానాపూర్ సెగ్మెంట్‌లో ఒక ప్రాంతంపైనే శ్రద్ధ
- స్థానిక పోరులో తప్పని ఎదురీత
Congress party internal conflicts in Nirmal district: మితి మీరిన ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి ఇదే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కాపురం అనే అపవాదు ఉంది. కానీ అది కేంద్ర, రాష్ట్ర పెద్దల్లో మాత్రమే కనిపించేది. ఇప్పుడు అదే సంస్కృతి జిల్లాలకు, నియోజకవర్గాలకు పాకింది. దీంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
నాయకుల మధ్య పెరిగిన వ్యత్యాసం
కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లాలోని నాయకుల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలు జిల్లా కమిటీకి సమాచారం, సంబంధం లేకుండా నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా కమిటీకి, నాయకులకు మధ్య దూరం పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతస్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంలో అధికార పార్టీ నాయకులు పూర్తిగా విఫలమైతున్నారు. ఎవరి దారిన వారు ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. తద్వారా పార్టీకి తీరని నష్టం కలుగుతుంది.
నిర్మల్ జిల్లా కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీకి పూడ్చుకోలేని లోటు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. మూడు నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య ఉన్న విభేదాలు కార్యకర్తలపై ప్రభావం చూపుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఉన్నారు. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీనీ జిల్లాలోనీ నాయకులు సమన్వయంతో ముందుకు తీసుకుపోవాల్సి ఉన్నప్పటికీ వారి మధ్య ఉన్న విభేదాల మూలంగా మరింత నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు.
నిర్మల్ నాయకుల్లో ఎడముఖం పెడ ముఖం
నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. ఇది అధికారిక కార్యక్రమాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ సమావేశాల్లోనూ ఎడముఖం పెడ ముఖంతో మొక్కుబడిగా హాజరవుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ అర్జుమన్ అలీ పైకి కలిసి ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ మూడు వర్గాలుగా కొనసాగుతున్నారు. అధికారిక సమావేశాలు ఉన్న సమయాల్లో ఎవరి వర్గంతో వారు హాజరవుతున్నారు. సమావేశం అయిన మరుక్షణం వర్గాల వారీగా వెళ్లిపోతున్నారు. వీరి మధ్య విభేదాలు చివరికి మండల, గ్రామ స్థాయి నాయకుల మధ్య కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
ముధోల్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు
మాజీ ఎమ్మెల్యేలు నారాయణ్ రావు పటేల్, విఠల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో పార్టీకి తీరని నష్టం ఏర్పడుతోంది. వీరి ఆధిపత్యపోరులో నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. అగ్ర నాయకుల మధ్య విభేదాలు ఉండడం వల్ల వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయమై ఎవరిని కలవాలో అర్థం కాని పరిస్థితిలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒకరిని కలిస్తే మరొకరికి కోపం వస్తుందనే భావనలో పార్టీ శ్రేణులు ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో అభివృద్ధి సైతం కుంటుపడుతోందనే విమర్శలు లేకపోలేదు.
ఖానాపూర్ నియోజకవర్గంలో అన్ని తానై
ఖానాపూర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు బొజ్జు పటేల్ అన్నీ తానే చూస్తున్నారు. గతంలో నాయకులు, కార్యకర్తలతో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి విషయాన్ని స్వయంగా పరిశీలించడం, సందర్శించడం చేస్తున్నారు. ఐతే ఇది కింది స్థాయి నేతలకు మింగుడు పడటం లేదు. ఇంతవరకు బాగానే ఉన్నా నియోజకవర్గంలో ఖానాపూర్ ప్రాంతాన్ని కొంత విస్మరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఉట్నూరు ప్రాంతానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో నియోజక వర్గాల విభజనలో ఉట్నూరు నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతం పైనే శాసనసభ్యులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది.
స్థానిక పోరులో తప్పని ఎదురీత
నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎదురీత తప్పకపోవచ్చు. నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి తీరని నష్టం కలిగించే అవకాశం ఉంది. జిల్లా నాయకులకు మండల నాయకులకు మధ్య ఉన్న వ్యత్యాసంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మండల నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ నాయకుల మధ్య ఉన్న విభేదాల ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ నాయకుల మధ్య సయోధ్య కుదరని పక్షంలో మూడు వర్గాల వారు ఎవరికి వారు అభ్యర్థులను రంగంలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే పార్టీకి స్థానిక సమరంలో పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. దీని ప్రభావం రాబోయే ఎన్నికలపైనా ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.