గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ హెచ్చరిక
Adivasi Bhimanna temple encroachment issue in Nirmal district: నిర్మల్ జిల్లా మమడ మండలం పోతారం గ్రామంలో ఆదివాసి నాయక పోడ్ తెగకు చెందిన ఆరాధ్య దైవం భీమన్న ఆలయాన్ని గిరిజనేతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం, ఆదివాసులపై దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముత్తాతల కాలం నుండి నాయకపోడ్ తెగకు చెందిన ఆదివాసులు పూజలు నిర్వహిస్తున్న తమ కులదేవత భీమన్న ఆలయాన్ని స్వాధీనంకోవడం తమ సంస్కృతి, సంప్రదాయాలను ధ్వంసం చేయడమే అవుతుందని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యంపై తక్షణమే స్పందించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని గోడం గణేశ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది.
తక్షణ చర్యలు లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన
ఫిర్యాదు చేసినప్పటికీ జిల్లా ఎస్పీతో పాటు ఎస్సై, కలెక్టర్లకు విన్నవించినా అధికారులు ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి కనీసం చర్యలు తీసుకోలేదని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గిరిజనేతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకొని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే, జిల్లా వ్యాప్తంగా తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా, వారం రోజులలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సంఖ్యాబలంతో దౌర్జన్యం
గ్రామంలో సంఖ్యాబలం ఎక్కువ ఉందని చెప్పి తక్కువ ఉన్న అమాయక ఆదివాసులపై ఈ దౌర్జన్యం చేస్తున్నారని, రూ.40 వేలకుపైగా కట్టిపించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గోడం గణేశ్ ఆరోపించారు. ఈ దాడులు చేస్తున్న గిరిజనేతరులకు కాంగ్రెస్, బీజేపీ వంటి రాజకీయ పార్టీల వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గ్రామంలో ఓటు బ్యాంకు ఉందని రాజకీయ నాయకులు వారికి మద్దతిస్తే, ప్రతి విలేజ్లో ఉన్న ఆదివాసులు తిరగబడక తప్పదని హెచ్చరించారు. ఓటు బ్యాంకు కోసం మెజారిటీ చూసి మురిసిపోవద్దని, ఆనాడు పాండవులు-కౌరవుల మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారో గుర్తు చేసుకోవాలని సూచించారు.
పోలీసుల దర్యాప్తునకు డిమాండ్
మండలంలోని ప్రతి గ్రామంలో, గూడెంలో భీమన్న దేవుడిని ఎవరు పూజిస్తారో పోలీసులు దర్యాప్తు చేసి తెలుసుకోవాలని, ఆ తరువాతే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పుట్టుక నుంచి చెట్లు, గుట్టల వెంట ఉంటూ తాము నిలుపుకున్న దేవుళ్ళపై గిరిజనేతరులు ఈ విధమైన దాడులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే నిర్మల్లో తుడుం మోగుతుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంక గారి భూమయ్య, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, అధ్యక్షులు అత్రం గణపతి, సురపు సాయన్న మాజీ సర్పంచ్, గుమ్ముల శ్రీనివాస్, పోతరాజు శ్రీనివాస్, బోర్ర భీమేష్, భీమేష్, సుంచు రామకృష్ణ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.