BC Rights Action Committee: కరీంనగర్, ఫిబ్రవరి 5 (మన బలగం): దేశ జన గణనలో కుల గణన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జరపాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఫిర్యాదుల కేంద్రంలో బీసీ హక్కుల సాధన సమితి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ, భారత దేశంలో ప్రజలందరికీ జాతి, కుల, వర్గ, లింగ వివక్ష లేకుండా సమానత్వాన్ని, సమాన హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చి కేంద్రంలో సగానికి పైగా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను పెరగకుండా ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి జరగాలంటే అన్ని రంగాల్లో సంపదలో వికేంద్రీకరణ జరగాలని, దేశంలో జంతు గణనలతో పాటు అన్నింటిని లెక్కలు తీయాలని సగానికి పైగా ఉన్న బీసీ కుల ఘన లెక్కలు తీయమంటే కేంద్ర ప్రభుత్వ కుంటి సాకులు సాంకేతిక లోపాలు వస్తాయని చెబుతుందని, కానీ అది నిజం కాదని అన్నారు. బీసీ కుల గణన చేసి విద్య ఉపాధి రంగాలలో మేమెంతో మాకంత వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 50 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు పరచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, రెండు లక్షల కోట్లతో బీసీ సంక్షేమ అభివృద్ధి కొరకు బడ్జెట్‌లో వెంటనే నిధులు కేటాయించాలని, సబ్సిడీ రుణాలు వృత్తిదారులకు ఇవ్వాలని, బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించాలని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బుచ్చన్న ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కోశాధికారి పైడిపల్లి రాజు నాయకులు గోదారి లక్ష్మణ్, అల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.