- పెల్లుబికుతున్న అసంతృప్తి
- హస్తం పార్టీలో అయోమయం
- కొత్తవారికి పదవులపై అసహనం
- దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నేతలు
- అధిష్టానం గుర్తించడంలేదని ఆగ్రహం
- సామూహిక నిరసన గళం
- కాంగ్రెస్‌లో రాజుకుంటున్న వర్గపోరు
Congress leaders are serious: నిర్మల్, అక్టోబర్ 24 (మన బలగం): ‘తెలంగాణ ఇచ్చింది మేమే.. మాతోనే రాష్ర్టం అభివృద్ధి సాధ్యం.. పదేళ్ల బీఆర్ఎస్ రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసింది..’ ఇలా పలు రకాల అస్త్రాలు సంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దశాబ్దకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా నాయకులు, కార్యకర్తలు పార్టీని నమ్ముకొని పనిచేసారు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదురైనా భరించి పార్టీని వీడికుండా ఉన్నారు. ఒత్తిళ్లను ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడ్డారు. పార్టీ అధికారంలోకి రాకపోతుందా తామ ఆశలు నెరవేరక పోతాయా అన్న నమ్మకంతో పార్టీలోనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై ఏర్పడిన అసంతృప్తికి తోడు కాంగ్రెస్ పార్టీ కేడర్ పటిష్ట ప్రణాళికతో పనిచేసింది. శక్తవంచన లేకుండా అహర్నిషలు కృషి చేసింది. నిద్రాహారాలు మాని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు.
అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మె్ల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ముందునుంచి ఉన్న నేతల్లో అసంతృప్తి మొదలైంది. తమకు ఎక్కడ ప్రాధాన్యత తగ్గుతుందోనని ఆందోళనలో పడ్డారు. ఎమ్మెల్యేలతోపాటు వారి అనుచరులు కాంగ్రెస్‌లోకి రావడంతో పాత, కొత్త కలయిక పొసగని పరిస్థితి నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి బాహాటంగానే కనిపించినా పార్టీ పెద్దలు మాత్రం సర్దిచెప్పే ప్రయత్నం చేసినా సమస్య పూర్తిగా సమసి పోలేదు. పాత, కొత్త వారు పాలు నీళ్లలా కలిసి పోకుండా ఉప్పు, నిప్పులా మారడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కొత్త సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో పరిష్కరిస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నా కంటి తుడుపు చర్యగానే ఉంటోంది. పార్టీలో నెలకొన్న అసంతృప్తి జ్వాలలు చల్లారడంలేదు. కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవుల్లో తమతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి రాజుకుంటోంది. దశాబ్దాలుగా పార్టీ కోసం పాటుపడ్డ తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.
నామినేటెడ్ పదవుల్లో సీనియర్లకు అన్యాయం
నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులకు పదవులు కేటాయించడంపై సీనియర్లు నిరసన గళం వినిపిస్తున్నారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ మారకుండా విశ్వసనీయంగా ఉన్న నాయకులను గుర్తించాల్సిన అధిష్టాన వర్గం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శలు ఉన్నాయి.
సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలి
అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలని పలువురు నాయకులు అంటున్నారు. సీనియర్లను గుర్తించకుండా ఇటీవలే పార్టీలు మారిన నాయకులకు ప్రాధాన్యత నివ్వడంతో తమకు అన్యాయం జరుగుతోందని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో ఎన్నో పార్టీలు మారినప్పటికీ తాము నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నామని, కొత్త వారి రాకతో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దల కాలం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు తమను గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
అడెల్లి చైర్మన్‌గా అవకాశం కల్పించండి : సింగం భోజా గౌడ్
మూడున్నర దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తనకు అడెల్లి దేవస్థానం చైర్మన్‌గా అవకాశం కల్పించాలని సింగం భోజా గౌడ్ పార్టీ అధిష్టాన వర్గాన్ని కోరారు. దశాబ్దాల కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తాను ఏనాడు ఏ పదవిని ఆశించలేదని అన్నారు. వృద్ధాప్యం చేరువైతున్న సమయంలో తనకు సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ దేవస్థానం చైర్మన్‌గా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని సింగం భోజా గౌడ్ కోరారు. డీసీసీ అధ్యక్షులు స్పందించి తనకు అవకాశం కల్పించే విధంగా చూడాలని అన్నారు.
డీసీసీకి వీడీసీ వినతి
అడెల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులకు వినతి పత్రాన్ని సమర్పించారు. సింగం భోజా గౌడ్‌కు అడెల్లి దేవస్థానం చైర్మన్‌గా అవకాశం కల్పించాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తికి అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు.