- 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు
- నియంత్రించకుంటే అనేక కుటుంబాలు అతలాకుతలం
Micro Finance: ధర్మపురి, జనవరి 7 (మన బలగం): జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో మళ్లీ మైక్రో ఫైనాన్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రోజూవారీ వడ్డీ లెక్కన పేదలను వడ్డీగాళ్లు నడ్డి విరుస్తున్నారు. అక్కరకు అందజేస్తామంటూ చేతిలో చిన్న మొత్తాలను పెడుతూ.. వడ్డీగాళ్లు పేదలను జలగాళ్ల పీల్చేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారులు, తోపుడుబండ్ల నిర్వాహకులు రోజు జరిగే వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటారు. అలాంటివారు పెట్టుబడి కోసం డెయిలీ ఫైనాన్స్, మంత్లీ ఫైనాన్స్ వారిని ఆశ్రయిస్తుంటారు. ఉదయం రూ.900 ఇస్తే సాయంత్రానికి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. తద్వారా రోజుకు ఒక్కొక్కరిపై రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మరికొందరైతే రూ.9వేలు ఇచ్చి, 4 వారాల్లో రూ.10 వేలు జమ చేసుకుంటారు. ఈ లెక్కన వడ్డీ వ్యాపారులు సాగిస్తున్న దందా ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కరలేదు. ఇటీవల మైక్రో ఫైనాన్స్ సంస్థలు వెలుస్తూ ఇళ్లు, స్థలాలు, భూములు, వాహనాలను తమవద్ద పెట్టుకుని అప్పులు ఇస్తున్నారు. సకాలంలో చెల్లించలేకపోతే తమవద్ద పెట్టిన వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నారు.
అప్పు కట్టని వారి ఇంటి వద్ద హంగామా చేయడం, వ్యాపారం చేసుకునే చోట అవమానించడం చేస్తున్నారు. డబ్బులు చెల్లించే వరకు పరువుకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం చేస్తున్నారు. మధ్యతరగతి వారు నలుగురిలో పరువు పోతుందన్న భయంతో బాధితులు లోలోపల బుజ్జగింపులకు ప్రయత్నిస్తున్నారు. వారి ఆగడాలు తాళలేక పలువురు ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు సైతం ఉన్నాయి. గ్రామాలలో మహిళా సంఘ సభ్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని రూ.100కు 10 -15 శాతం అధిక వడ్డీవడ్డీ రేటుతో అప్పులు ఇస్తున్నారు. కూలీలు, చిరు వ్యాపారులు, ఆటో నడుపుకునే వారే లక్ష్యంగా అప్పులు ఇస్తూ జేబులు నింపుకుంటున్నారు. అప్పు ఇచ్చే సమయంలో ప్రామిసరీ నోటు మీద సంతకాలు చేయించుకుంటున్నారు. మరి కొందరి వద్ద ఖాళీ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు, భూమి డాక్యుమెంట్లను కుద పెట్టుకుని ఇస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. మైక్రో ఫైనాన్స్ ఇచ్చే వ్యక్తులను, సంస్థలను నియంత్రించకుంటే చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి.