New Lady of Justice Statue: న్యాయదేవత కళ్లు తెరవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజంగానే న్యాయదేవత కళ్లకు ఉన్న గంతలు తొలగిపోయాయి. ‘కళ్లు ఉండి చూడలేని న్యాయదేవత..’ అంటూ ఇకపై ప్రస్తావించాల్సి రాకపోవచ్చు. ఎందుకంటే న్యాయదేవత విగ్రహం రూపం పూర్తిగా మారిపోయింది. విగ్రహానికి పలు మార్పులు చేశారు. తాజాగా నూతన విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. న్యాయదేవత విగ్రహం కళ్లకు ఉన్న గంతలు తొలగించడంతోపాటు తలపై కిరీటం, ఎడమ చేతిలో కత్తికి బదులుగా రాజ్యాంగం పుస్తకంతో కొత్త రూపుతీసుకొచ్చారు. చట్టం గుడ్డిది కాదని, శిక్షకు ప్రతీక కాదనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్పులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ వారసత్వం నుంచి భారత్ ముందకు సాగాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్రం సైతం ఐపీసీ స్థానంలో బీఎన్ఎస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.