- రాబోయే 10 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లోటు రాకుండా చర్యలు
- రిజర్వాయర్‌ల నుంచి విడుదల చేసే నీటిని సమర్థవంతంగా వినియోగించాలి
- యాసంగి సాగు నీటి సరఫరా, గురుకులాల సందర్శనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎస్
- హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Chief Secretary Shanti Kumari: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 3 (మన బలగం): చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగు నీరు సరఫరా అందెలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి యాసంగి సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పని తీరు, సంక్షేమ హాస్టళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రణ, పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయా శాఖ అధికారులతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, యాసంగి పంట సంరక్షణకు రాబోయే పది రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు, విద్యుత్తు సరఫరా అవసరమైన మేర పొలాలకు చేరేలా చూడాలని, వ్యవసాయ శాఖకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని సిఎస్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. భారీ నీటి పారుదల శాఖ పరిధిలోని రిజర్వాయర్లలో అవసరమైన మేర సాగునీరు అందుబాటులో ఉందని, పంటలకు సమృద్ధిగా నీరు విడుదల చేయడం జరుగుతుందని, విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా అధికారులు సమర్థవంతమైన పర్యవేక్షణ చేయాలని అన్నారు.
యాసంగిలో 77 లక్షల ఎకరాలలో సాగు జరుగుతోందని, ముఖ్యంగా వరి పంట 54.82 లక్షల ఎకరాల సాగు జరిగిందని, గత సంవత్సరం కంటే 2 లక్షల 70 వేల ఎకరాలు వరి, లక్ష ఎకరాల మొక్కజొన్న పంట అధికంగా పండుతుందని అన్నారు. సిద్దిపేట, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి మొదలగు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయని వీటిని పక్కగా పర్యవేక్షిస్తూ పొలాలు ఎండిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు రాక పోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల కొంత మేరకు రైతులు ఇబ్బందులకు గురి కావడం గమనించామని అన్నారు. ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. ఎస్సారెస్పీ, ఎస్సారెస్పీ స్టేజి 2, నాగార్జున సాగర్, ఏఎంఆర్ లిఫ్ట్, కల్వకుర్తి, ఇతర ప్రాజెక్టుల కింద నిర్దేశిత పంట పొలాలకు సాగునీరు అందాలని సీఎస్ తెలిపారు. రాబోయే 10 రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి వచ్చే డిమాండ్ అనుగుణంగా సాగునీరు విడుదల చేస్తూ రైతుల పొలాలు ఎండిపోకుండా కాపాడాలని సిఎస్ ఆదేశించారు.
ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎక్కడ లోటు రాకుండా చూసుకోవాలని సీఎస్ డిస్కం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న పీక్ డిమాండ్‌కు మరో 10 నుంచి 15 శాతం పెరిగినా తట్టుకునెలా విద్యుత్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని సీఎస్ పేర్కొన్నారు. సాగు నీరు సరఫరా, పంటల పరిస్థితుల పై పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు స్పందించాలని, రైతులు ఆందోళనకు గురికాకుండా సమృద్ధిగా సాగు నీటి సరఫరా అవుతుందని భరోసా కల్పించాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని అన్నారు. రాబోయే 10 రోజులపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ లెవెల్‌లో రైతులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని అన్నారు. సాగు నీరు ఇబ్బందులు ఏర్పడే జిల్లాలలో మండలాల వారీగా తహసిల్దార్, నీటిపారుదల శాఖ ఇంజనీర్, వ్యవసాయ అధికారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటించాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ల తనిఖీ తర్వాత పరిస్థితులలో మార్పులు వచ్చాయని, పిల్లలకు అందించే ఆహార నాణ్యత పెరిగిందని, కామన్ మెన్యూ డైట్ పక్కాగా అమలు అవుతుందని అన్నారు. సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ నిషేధం సంబంధించి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చర్యలు తీసుకోవాలని సిఎస్ తెలిపారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లాలోని 43 రెసిడెన్సి హాస్టల్లోని విద్యార్థుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అలాగే ఇతర శాఖల జిల్లా అధికారులతో కమిటీ వేసి నిత్యం తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్ అలాగే ఇతర విద్యాలయాలను నిత్యం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నానని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రెసిడెన్షియల్ హాస్టల్లో ఎలాంటి ఇబ్బంది లేవని స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు లేవని, నీటి సరఫరాలో ఇబ్బందులు లేవని వివరించారు. జిల్లాలో గతేడాది రబీ సీజన్లో 1,74,000 ఎకరాల్లో పంటలు సాగు చేశారని, ఈ ఏడాది రబీ సీజన్లో 1,79,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అబ్జర్వేగం ఉద్యానవన శాఖ అధికారి, సెస్ అధికారులు, భూగర్భ జల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.