Mudhol MLA Pawar Rama Rao Patel: ముధోల్, డిసెంబర్ 28 (మన బలగం): అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రశ్నించారు. నిర్మల్ ఆర్డీవో ఆఫీసు ఎదుట కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని శనివారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్న సీఎం నాడు టెంట్ కింద హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర పరిస్థితి కనిపించలేదా అని ప్రశ్నించారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం తీర్చే వరకు సమ్మె విరమించవద్దని, అప్పటి వరకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఎవరూ అధైర్య పడద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో సీఎం, సంబంధిత మంత్రివర్యులతో ఫోన్లో మాట్లాడుతానని తెలిపారు.