- మరో రెండు నెలల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం
- నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
MLA Sanjay Kumar: జగిత్యాల, అక్టోబర్ 7 (మన బలగం): ఇరవై ఐదు వేల మంది పేద, మధ్య తరగతి ప్రజల నీడ కోసమే నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ లక్ష్యమని, త్వరితగతిన పనులను పూర్తిచేయించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం అధికారులు, నాయకులతో కలిసి నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పురోగతిని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ 2008లో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 4 వెల ఇండ్లకు 400 మాత్రమే స్లాబ్ దశ పూర్తి అయ్యాయని, 1600 ఇండ్లు బేస్మెంట్ మాత్రమే అయ్యాయని మిగతావన్ని ప్రారంభ దశకు చేరలేదన్నారు.
నేడు 4,520 ఇండ్లను పూర్తి చేసినట్లు తెలిపారు.
గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు సైతం మౌలిక వసతుల కల్పన జరగలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి, డ్రైనేజీ పనులను పరిశీలించినట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌ను కోరామన్నారు. అమృత్ కార్యక్రమంలో భాగంగా రూ.36 కోట్లతో డబల్ బెడ్ రూం ఇండ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఇప్పటికే నివాసముంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, సమస్య పరిష్కరించాలని అధికారులకు చెప్పామన్నారు. పేదల సొంతింటి కల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అని, అతిత్వరలోనే మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తవుతాయని, భారీ వర్షాల కారణంగా కొంత పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. 14 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్, రూ.7 కోట్లతో సంపు నిర్మాణం పూర్తయిందన్నారు.
డ్రైనేజీ, సేప్టిక్ ట్యాంక్ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామన్నారు. 2 నెలల్లో దాదాపు పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దాదాపు 25 వేల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు వసతి కల్పనతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందజేసే బాధ్యత అధికారులదేనన్నారు. గతంలో 500 అక్రమ నిర్మాణాలు కూల్చడం జరిగిందన్నారు. రూ.1700 కరెంట్ మీటర్ అందజేస్తామని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నారు. కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్‌లకు జగిత్యాల ప్రజల పక్షాన ధన్యవాదాలు అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సమ్మయ్య, అడువాల లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ చాంద్ పాషా, ఏఈలు రాజ మల్లయ్య, శరన్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.